విక్టరీ వెంకటేష్ నటించిన ‘అబ్బాయి గారు’ సినిమాలో కోట శ్రీనివాసరావు పరుపులో కొన్ని నోట్ల కట్టలను పెట్టిన సీన్ గుర్తుందా! బహుశా ఇది రీల్ సీన్ కంటే కూడా రియల్ సీన్ గా ఊహిస్తే… ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అవును… ఇండియాలో నల్లధనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటివరకు ఎక్కడో ఒక చోట మూలుగుతున్న కరెన్సీ కట్టల దుమ్ము దులపాల్సిన పరిస్థితి తలెత్తడంతో… నల్ల కుబేరులంతా వాటిని తెల్లగా మార్చుకునేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలో తమ ‘మందిగామధుల’ అకౌంట్లలో 2.50 లక్షల చొప్పున డిపాజిట్లు చేయిస్తున్నారని ఐటీ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే ఒక్క స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలోకే ఏకంగా 60,000 కోట్లు వచ్చాయని సదరు బ్యాంకు చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. తొలి రోజైన గురువారం 31 వేల కోట్లు రాగా, రెండవ రోజు 22 వేల కోట్లు వచ్చినట్లుగా తెలిపారు. అలాగే ఈ రెండు రోజుల్లో దాదాపు 1500 కోట్లను దేశవ్యాప్తంగా మార్పిడి చేసినట్లుగా పేర్కొన్నారు.
ఒక్క స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరిస్థితే ఇలా ఉంటే… ఇతర బ్యాంకులను కలుపుకుని లెక్కిస్తే… సామాన్య ప్రజానీకం నోరెళ్ళబెట్టాల్సిందేనెమో! దీంతో మోడీ తీసుకున్న నిర్ణయం ఎంత విలువైనదో తెలిసి వస్తుంది. ఇది కేవలం తొలి రెండు రోజుల విషయం మాత్రమే. డిసెంబర్ 30వ తేదీ వరకు ఉన్న గడువు లోపల ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో వేచిచూద్దాం.



