వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటిసులో పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు, హైకోర్టు రెండూ కూడా జోక్యం చేసుకునేందుకు నిరాకరించి, ఈ కేసులో సీబీఐ విచారణను కొనసాగించవచ్చునని స్పష్టం చేశాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అరెస్ట్ చేసేందుకు కూడా ఎటువంటి అవాంతరాలు లేవు. కనుక అవినాష్ రెడ్డికి సిబిఐ నుంచి పిలుపు వచ్చిన ప్రతి సారి అరెస్ట్ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతోంది.
అవినాష్ రెడ్డికి వివేకా హత్యతో సంబంధం ఉందని, కనుక అరెస్ట్ చేయక తప్పదని సిబిఐ పదేపదే హైకోర్టుకి చెపుతోంది కూడా. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన తర్వాత కూడా అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసేందుకు ఎందుకు తాత్సారం చేస్తోందో తెలీదు. కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో ‘టామ్ అండ్ జెర్రీ’ షోలాగా కొనసాగుతూనే ఉంది ఇంకా.
ఇది ఇంకా ఎంతకాలం సాగుతుందో ఏ విధంగా ముగుస్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు కానీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడంలో తెర వెనుక ఏదో బలీయమైన రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని మాత్రం స్పష్టమవుతోంది.
ఈ కేసులో మరో నిందితుడు, అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సిబిఐ కోర్టు తిరస్కరించింది. కనుక అతను కూడా హైకోర్టులో మరో పిటిషన్‌ను వేయడం ఖాయమే. వివేకా హత్య కేసు విచారణను జూన్ నెలాఖరులోగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఈ కేసులో నిందితులందరూ ఒకరి తర్వాత మరొకరు వేర్వేరు కోర్టులలో రకరకాల పిటిషన్లు వేస్తుంటే, సీబీఐ వాటన్నిటికీ హాజరవుతూ, వాటి గురించి వాదించడానికే పుణ్యకాలం అంతా సరిపోతోంది. ఇంక వివేకా హత్యకేసులో నిందితులను, వారి వెనుక ఉన్నవారిని ఎప్పుడు కనిపెట్టగలదు? శిక్షలు పడేలా ఎలా చేయగలదు? అనే సందేహం కలుగకమానదు.



