Tollywood Jaganచంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్లో హై కోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పుని రిజర్వ్ లో ఉంచారు జస్టిస్ కే.శ్రీనివాస్ రెడ్డి. సిఐడి తరుపున సుప్రీం కోర్ట్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఏఏజి పొన్నవేలు సుధాకర్ రెడ్డి… బాబు తరుపున సిద్దార్ధ్ లూథ్రా వాదనలను వినిపించారు.

మరో రెండు రోజులలో తీర్పు వెలువడిస్తాను అంటూ న్యాయమూర్తి ఇచ్చిన ప్రకటనతో వైసీపీ సర్కార్ ప్లాన్ ‘బి’ ని సిద్ధం చేస్తున్నట్టుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు బలహీనపడుతున్న నేపథ్యంలో ఒకవేళ ఆకేసులో బాబుకి బెయిల్ వచ్చిన మరో కేసులో లోపలి పంపడానికి ఇప్పటికే రంగం సిద్దంచేసిన వైసీపీ ఇప్పుడు మరో కేసుతో కోర్ట్ ముందుకొచ్చింది.

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం అనుమానమే అనిపిస్తుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి చంద్రబాబు పై ఇప్పటికే పీటీ వారెంట్ ఇష్యూ చేసింది. అది కాక ఇప్పుడు తాజాగా ఫైబర్ గ్రిడ్ స్కామ్ అంటూ సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ వేయగా కోర్ట్ దానిని విచారణకు స్వీకరించింది. ఈ కేసులో బాబుని ప్రధమ ముద్దాయిగా పేర్కొనడం చంద్రబాబు పై జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు అద్దం పడుతుంది.

ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రాగానే లోకేష్ అరెస్ట్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న తరుణంలో ఇప్పుడు బాబు పై మరో కేసు అంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈముందస్తు ప్రణాళికలు టీడీపీ నేతలకు ఒకరకంగా ఆందోళనను మరో రకంగా ఊరటను కలిపిస్తుందనే చెప్పాలి . ఆందోళన విషయానికి వస్తే ఈ కేసులో బయటకు వచ్చిన మరో కేసులో అరెస్ట్….ఊరట విషయాన్ని వస్తే జగన్ ప్రభుత్వం పెట్టిన ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు పై జగన్ చేసిన వార్తలు అవాస్తవమని ఒప్పుకున్నట్లే! ఇది ఒకరకంగా టీడీపీ కి గెలుపు మాదిరే.

రాజకీయాలలో కోర్టులు – కేసులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం సహజమే. అయితే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను చంద్రబాబు ఈ వయస్సులో ఎదుర్కోవడం అంటే కత్తిమీద సాము వంటిదే. సైబరాబాద్ వంటి మహానగరాన్ని నిర్మించిన అటువంటి నేత ఇప్పుడు సెంట్రల్ జైల్లో గడపడం కాసంత కష్టమైనదే. రామునికి గుడికట్టిన రామదాసుకే తప్పలేదు కటకటాలు…ఇక మనమెంతా అంటూ మానసిక ధైర్యంతో బాబు అడుగులు ముందుకు వేయాల్సిన సమయం ఇది.

జగన్ బిగిస్తున్న ఈ పద్మవ్యూహాన్ని బాబు అండ్ కో సమర్దవంతం గా ఛేదించి బయట పడితేనే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ ఉనికి నిలబడుతుంది. జగన్ ఒకటి తరువాత ఒకటి కేసులు వేస్తూ పోతున్నాడంటేనే అర్ధమవుతుంది తన ప్రభుత్వం పెట్టె కేసులలో ‘పస’ లేదు ‘పగ’ మాత్రమే ఉందని.

వైసీపీ ప్రభుత్వం పెట్టె ప్రతి కేసులో బాబుకి బెయిల్ వచ్చే అవకాశం ఉందనేగా మరో కేసులో మరికొన్ని రోజులు బాబుని జైలుకి పరిమితం చెయ్యాలని కాలం గడువుతున్నారు. దీనినే ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లి పార్టీ ని పార్టీ అధినేతను నిర్దోషిగా ప్రజల ముందుంచాల్సిన బాధ్యత పార్టీ సీనియర్లదే. ఇన్నాళ్లు పార్టీ ఇచ్చిన పదవులు అనుభవించడం కాదు పార్టీకి పదవులను కట్టబెట్టే ప్రణాళికలు రూపొందించాలి.