Jagan

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటికీ తాను ముఖ్యమంత్రినే అన్నట్లు మాట్లాడుతున్నారు. తాను అమలుచేసిన విధానాలను, పదకాలను, నియమించిన తాత్కాలిక ఉద్యోగులను కూటమి ప్రభుత్వం యధాతధంగా అమలుచేయకపోవడం చాలా ద్రోహం అని వాదిస్తున్నారు. వైసీపీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసమే వాలంటీర్లని నియమించుకొని అవసరం తీరాక అందరినీ రోడ్డున పడేసి పోయారు. వారిని ఉద్యోగాలలో కొనసాగించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని నేటికీ వితండవాదం చేస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో మున్సిపల్, పంచాయితీ కార్యాలయాలు, వైద్య, విద్యుత్ శాఖల కార్యాలయాలు.. వాటిలో లక్షల మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించేందుకు ఉండగా, వాటికి సమాంతరంగా వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థలని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? కానీ చేశారు. కూటమి ప్రభుత్వం వాటిని కొన సాగిస్తూనే అవసరాలకు తగినట్లు సిబ్బందిని బదిలీలు చేస్తుంటే డానినీ జగన్‌ తప్పు పడుతున్నారు.

Also Read – వైసీపీ..బిఆర్ఎస్ ఇద్దరిది అరెస్టుల రాజకీయమేనా.?

రేషన్ బియ్యం, సరుకులు పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రేషన్ షాపులు, డీలర్లు ఉండగా వాటికి సమాంతరంగా రేషన్ బియ్యం, సరుకులు గుమ్మం వద్దకే అందిస్తామంటూ 9,200 వాహనాలు, వాటి కోసం దాదాపు 20,000 మంది సిబ్బందిని నియమించారు. కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల సంఖ్య, పని గంటలు పెంచి మరింత వెసులు కల్పించేందుకు సంస్కరణలు చేపడుతుంటే, రేషన్ సరుకుల పంపిణీకి తాను సృష్టించిన సమాంతర వ్యవస్థని ఎందుకు కొనసాగించడం లేదంటూ జగన్‌ విమర్శిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం వాలంటీర్లను, రేషన్ సరుకుల పంపిణీకి నియమించిన వారిని, మద్యం కుంభకోణంలో పాత్రదారులుగా పనిచేసిన బెవరేజ్ కార్పొరేషన్‌ సిబ్బందిని, ఏపీ ఫైబర్ నెట్‌లో కుంభకోణాలకు పాల్పడినవారిని తొలగించి బడుగు బలహీనవర్గాలను రోడ్డున పడేస్తోందని వితండవాదం చేస్తున్నారు.

Also Read – ప్యాలస్ లు కాదు పరిశ్రమలు కావాలి..!

వీటితో తాను లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే, చంద్రబాబు నాయుడు రాగానే అందరి ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేస్తున్నారని జగన్‌ ఆరోపిస్తున్నారు.

కానీ వాలంటీర్లకు జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీతం ఎంత? నెలకు రూ.5,000. దాంతో వారు కుటుంబాలను పోషించుకోగలరా? ఆ నామ మాత్రపు జీతాలతో 5 ఏళ్ళు వారితో వెట్టి చాకిరీ చేయించుకున్నారే తప్ప వారి ఉద్యోగాలకు చట్ట బద్దత, ఉద్యోగ భద్రత ఎందుకు కల్పించలేదు?

Also Read – కుప్పం ఘటన: వైసీపీ మొదలుపెట్టేసిందిగా!

ఇప్పుడు కూటమి ప్రభుత్వం పింఛన్లే నెలకు రూ.4,000 ఇస్తున్నప్పుడు, వాలంటీర్లకు జగన్‌ ఇచ్చిన జీతం ఏపాటి? వాలంటీర్లు రోడ్డున పడ్డారని తెలిసి ఉన్నప్పుడు జగన్‌ వారిని ఆదుకునే ప్రయత్నం చేశారా?అంటే అదీ లేదు కదా?మరి వారి గురించి ఈ మొసలి కన్నీళ్ళు దేనికి?




అయినా జగన్‌ చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు పనిచేయాలి? ముఖ్యమంత్రి పదవి ఊడిపోయి ఏడాదవుతున్నా శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా, ప్రాణభయంతో ప్యాలస్‌ గడప దాటని జగన్‌, రాష్ట్రం గురించి, ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?