ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న వీధి శునకాల అంశం ఇప్పుడు సెలబ్రెటీల ట్వీట్లతో సోషల్ మీడియా వేదికెక్కింది. వీధి కుక్కల పై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు సినీ సెలబ్రెటీలు, కొంతమంది రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ జంతు ప్రేమను పంచుకుంటున్నారు.
ముందుగా కేంద్ర ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సుప్రీం కోర్ట్ తీర్పు పై మొదటిగా వ్యతిరేఖ స్వరం వినిపించారు. ఈ నిస్సహాయ జీవులను తరలించాలి అంటూ సుప్రీం ఆదేశించడం క్రూరమైన చర్య అవుతుంది,
శాస్త్రీయ పద్దతులను అనుసరిస్తూ టీకాలు, స్టెరిలైజేషన్, వాక్సిన్ల తో సమాజాన్ని సంరక్షణలో ఉంచవచ్చు, సమాజంలో ప్రజల భద్రత మరియు జంతు సంక్షేమం రెండు భాగమే, వీటి పై కాస్త కరుణ చూపించాలి అంటూ రాహుల్ తన సోషల్ మీడియా వేదికగా తన జంతు ప్రేమను చాటుకున్నారు.
ఇక సినీ సెలబ్రెటీలైన అడవి శేషు, జయం సదా వంటి వారు సైతం సుప్రీం కోర్ట్ తీర్పు పునః సమీక్షించుకోవాలంటూ కోర్ట్ కు విన్నపాలు చేస్తున్నారు. జంతువుల పట్ల మానవత్వం చాటుకోవడం, వాటి సంక్షేమం కోసం ఆరాటపడడం సమంజసమే కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయంటూ మరికొంతమంది వాదిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో వీధి కుక్కల బారిన పడి అనేకమంది పసి పిల్లలు క్రూరంగా హింసించబడ్డారు, కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. పిల్లలనే కాదు పెద్దలు సైతం ఇటువంటి ప్రమాదాల బారిన పడి ప్రాణాలతో పోరాడిన వారు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు.
అటువంటి వారి కుటుంబాల కన్నీటి వేదనకు ఈ సెలబ్రెటీల ట్వీట్లు ఓదార్పు నివ్వగలవా.? పదుల సంఖ్యలో సెక్యూరిటీలను పెట్టుకుని గుమ్మంలో అడుగు పెట్టింది మొదలు మళ్ళీ తిరిగి గడప తొక్కే వరకు ఖరీదైన కార్లలో తిరుగు విలాసవంతమైన జీవితం గడిపే వారికి ఒక సామాన్యుడి ఆవేదన ఎలా అర్ధమవుతుంది.?
అటువంటి వారికి ఇటువంటి ప్రమాదాల గురించి అవగాహనా ఎలా ఉంటుంది.? కుక్క కాటుతో రాబిస్ బారిన పడిన వారి జీవితాల గురించి వీరికి ఎటువంటి ఆవేదన ఉండదు, ఎందుకంటే వారికి ఆ పరిస్థితి ఎప్పటికి రాదు కాబట్టి అంటూ కొంతమంది ఈ సెలబ్రెటీల వాదనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సెలబ్రెటీలు ఇంట్లో సరదగా పెంచుకోవడానికి స్పెషల్ బ్రీడ్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు, కానీ ఇటువంటి స్ట్రీట్ డాగ్స్ ను ఎంచుకోరు, వారికి స్ట్రీట్ డాగ్స్ మీద అప్పుడు లేని జంతు ప్రేమ ఇప్పుడు కలిగిందా అంటూ ఒక వర్గం ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతూ సుప్రీం కోర్ట్ తీర్పుని స్వాగతిస్తున్నారు.
అయితే ఇక్కడ జంతు సంరక్షణ ఎంత ముఖ్యమో మానవీయ కోణం కూడా అంతే ప్రాధాన్యం. జంతువుల సంరక్షణ పసిపిల్లల ప్రాణాల మీదకు రాకూడదు, వీరి రక్షణ వాటి సంరక్షణ కోసం అందరు కలిసి కట్టుగా ఒకతాటి మీదకు రావాల్సి ఉంటుంది.






