ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో ఏపీ, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో రూ.4,600 కోట్లతో సెమీ కండక్టర్ కంపెనీలను నెలకొల్పడానికి ఆమోదముద్ర వేశారు.
దేశంలో ఇప్పటికే ఆరు కంపెనీలు వివిధ దశలలో ఉన్నాయి. ఇప్పుడు మరో నాలుగు కంపెనీలకు ఆమోదముద్ర వేయడం ద్వారా ఈ రంగంలో కూడా భారత్ వేగంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.
ఈరోజు ఆమోదం లభించినవాటిలో సిస్ సెమ్, కాంటినెంటల్ డివైస్ ఇండియా లిమిటెడ్, త్రీడీ గ్లాస్ సొల్యూషన్స్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ (ఏఎస్ఐపీ). వీటిలో రెండు ప్లాంట్స్ ఒడిశాలో, ఒకటి పంజాబ్‌లో, దక్షిణ కొరియాకు చెందిన ఏఎస్ఐపీ ప్లాంట్ ఏపీలో నెలకొల్పుతారు.
ఏడాదికి 96 మిలియన్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు అవుతున్న ఈ ప్లాంట్లో అత్యంత నైపుణ్యం కలిగిన చిప్ డిజైనింగ్ నిపుణులతో సహా అనేక వందల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. ఇటువంటి సెమీ కండక్టర్ కంపెనీలకు తగిన విద్యార్హతలు, నైపుణ్యాల కోసం ఉన్నత విద్యాసంస్థలు కూడా ఏర్పాటు అవుతాయి. కనుక వాటి ద్వారా అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి.
ఈ సెమీ కండక్టర్ కంపెనీలలో తయారైన చిప్పులను మొబైల్ ఫోన్లు మొదలు వాహనాలు, వివిధ రకాల పరిశ్రమలలో, అవి తయారు చేసే అనేక ఉత్పత్తులలో వినియోగిస్తారు. కనుక నానాటికీ వీటి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది.
ఏ దేశం లేదా రాష్ట్రంలోనైనా సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందంటే, అది అభివృద్ధికి నిదర్శనంగా పరిగణిస్తుంటారు.
రాష్ట్ర విభజన, ఐదేళ్ళ జగన్ పాలనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఇటువంటి కీలకమైన ప్లాంట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా శుభ పరిణామమే.
కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవిదంగా ఒకటొకటీగా అన్నీ సాధించుకుంటే, ఇదివరకు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయ కారణాలతో కేంద్రంపై కత్తులు దూస్తూ తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించుకుంటున్నారేమో అనిపిస్తుంది.





