నేడు దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పోలీస్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.
నిన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులను ఓడించడం ద్వారా అక్కడి ప్రజలకు వైఎస్ కుటుంబం చెర నుంచి విముక్తి లభించింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్భయంగా, స్వేచ్చగా ఓట్లు వేశారు. కనుక వారికి ఒకరోజు ముందే వైఎస్ కుటుంబం నుంచి స్వాతంత్ర్యం లభించింది.
నేటి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (స్త్రీశక్తి) పధకం అమలు కాబోతోంది.
ఈరోజు మధ్యాహ్నం 4.00 గంటలకు విజయవాడలో సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ పధకం ప్రారంభించి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ఈ పధకాన్ని ప్రారంభిస్తారు.
ఇంతకాలం విద్యార్ధినులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలు, కూరగాయలు వగైరా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలు, గ్రామాల నుంచి సమీపంలో పట్టణాలకు కూలి పనులకు వెళ్ళే మహిళలకు, ఆస్పత్రులలో చికిత్సలకు వెళ్ళే మహిళలకు టికెట్ ఛార్జీల భారం తప్పేది కాదు. నేటి నుంచి వారికి విముక్తి లభిస్తుంది. ఇకపై పైసా ఖర్చు పెట్టకుండా తమ పనులకు వెళ్ళిరావచ్చు. కనుక నేటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కూడా స్వాతంత్ర్యం వచ్చినట్లే కదా?




