రాష్ట్ర విభజన తర్వాత అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఉన్న ఒకే ఒక్క ఆశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న పేరు. హైదరాబాద్ ను అంతర్జాతీయ పటంలో పెట్టిన ఘనతను సొంతం చేసుకున్న బాబు, ఏపీని కూడా గాడిలో పెడతారన్న విశ్వాసంతోనే ప్రజలు పట్టం కట్టి ఓ మహత్తర బాధ్యతను అందించారు. తొలి ఏడాదిలోనే రెండెంకల వృద్ధి రేటును సాధించిన ఏపీ సర్కార్, తాజాగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ రెండేళ్ళ అభివృద్ధిపైన, భవిష్యత్తు ప్రణాళికలపైన, గత అనుభవాల పైన చంద్రబాబు తన ఆలోచనలను మీడియా వర్గాలతో పంచుకున్నారు.
ఎంత కష్టసాధ్యమైనా రాష్ట్రం కోసం శ్రమిస్తుంటే జగన్ మోహన్ రెడ్డి స్వార్ధ రాజకీయ లబ్ది కోసం చేస్తున్న అనేక ప్రయత్నాలు రాష్ట్ర అభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయని, ముఖ్యంగా రాష్ట్రంలో సృష్టిస్తున్న భయానక వాతావరణం వలన పెట్టుబడులు పెట్టే వారు ఆలోచించే పరిస్థితులు నెలకొంటాయని తుని ఘటనను ఉదహరిస్తూ చెప్పుకొచ్చారు. అలాగే మర్రి చెన్నారెడ్డి వంటి రాజకీయ నేతలతో పనిచేసిన తానూ, చివరికి ఒక నేరస్తుడుకు సమాధానం చెప్పుకోవడం నా దౌర్భాగ్యంగా భావిస్తున్నానని… చంద్రబాబు తీవ్ర ఆవేదనను వ్యక్తపరిచారు.
2004 కంటే ముందు నేను బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం గడగడలాడేది… ఎక్కడికి వెళ్తున్నానో ఎవరికీ చెప్పేవాడిని కాదు, నేను వెళ్లిన తర్వాతే తెలిసేది. ఆకస్మిక తనిఖీలు, ఫైల్స్ క్లియరెన్స్… ఇలా నేను ఏ పని చేసినా ఉద్యోగుల్లో ఆ భయమనేది ఉండేది. ఆ భయంతో పనిచేశారు… అదే మాదిరిగా ఫలితాలు కూడా వచ్చాయి. కానీ, ఆ రోజు చేసే పనికి, ఈ రోజు చేసే పనికి ఒక తేడా ఉంది. ప్రస్తుతం ఒక ఫోకస్ తో, అందరికీ ఒక బాధ్యత తీసుకువచ్చి, టెక్నాలజీ ఉపయోగించి ఫలితాలు రాబట్టేలా ముందుకు వెళ్తున్నాము… అప్పటికీ, ఇప్పటికీ తేడా అదే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.



