Chandrababu Naiduస్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ జ్యూడిషియల్ రిమాండ్‌ విధించడంతో 10వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌, హైకోర్టులో ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్‌ వేశారు. ఆ రెండు పిటిషన్లపై నేడు విచారణ జరుగబోతోంది.

ఒకవేళ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ మళ్ళీ వెంటనే మరో కేసుతో అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు సిద్దంగా ఉన్నారు. కనుక బెయిల్ వలన ప్రయోజనం ఉండదని అర్దమవుతోంది. కనుక హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కీలకం కాబోతోంది.

ఒకేవేళ హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తే చంద్రబాబు నాయుడుకి ఈ కేసు నుంచి విముక్తి లభిస్తుంది. కానీ వైసీపి ప్రభుత్వం ఆయనను ఎలాగైనా జైలులోనే ఉంచాలని పట్టుదలగా ఉంది. కనుక ఆయనపై అన్ని కేసులను ఒకేసారి పెట్టకుండా ఒకదాని తర్వాత మరొకటి నమోదు చేసేందుకు సిద్దంగా ఉంది.

కనుక ఈ కేసు నుంచి ఆయన ఏవిదంగా బయటపడినా మరో కేసుతో ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమనే భావించవచ్చు. కనుక ఈ కేసుల నుంచి ఆయనకు ఏవిదంగా విముక్తి కల్పించాలనేది, ఆయన తరపు వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లుద్రా ఆలోచించవలసి ఉంది.

ఒకవేళ ఏసీబీ కోర్టు, హైకోర్టు చంద్రబాబు నాయుడి పిటిషన్లను తిరస్కరించినా, వాయిదా వేసినా చంద్రబాబు నాయుడు బయటకు రాలేరు.

గతంలో అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారు. వాటిలో సీబీఐ పక్కా సాక్ష్యాధారాలతో సహా 11 ఛార్జ్ షీట్స్ దాఖలు చేసింది. అయినప్పటికీ వారందరూ బెయిల్ పొంది బయటకు రాగలిగారు.

అయితే స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఎటువంటి సాక్ష్యాధారాలను ఏపీ సీఐడీ చూపలేకపోవడం నిజమైతే చంద్రబాబు నాయుడుని ఇక జైల్లో నిర్బందించి ఉంచడం అసాధ్యమే. అయితే ఆయన ఎప్పటికి విడుదలవుతారనేది న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది.

ఒకవేళ ఈ కేసుల నుంచి చంద్రబాబు నాయుడు బయటపడగలిగితే అప్పుడు వైసీపి ప్రభుత్వానికే రివర్స్ గేరు పడవచ్చు. తనపై రాజకీయకక్షతో ఇటువంటి కేసులు పెట్టి, తన ప్రతిష్టను, రాజకీయ జీవితాన్ని దెబ్బ తీసేందుకు ప్రయాణించారని ఆయనే పరువు నష్టం దావా వేస్తే దీనికి బాధ్యులైన వారందరూ న్యాయపరమైన చిక్కులలో పడే అవకాశం ఉంది.