Chandrababu-Naidu-Kuppamకేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విశాఖ పర్యటనలో జగన్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలలో మునిగితేలుతోందని, ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఆయన విమర్శలపై వైసీపీ నేతలు స్పందిస్తూ, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్‌ షాను కలిసివచ్చిన తర్వాతే బిజెపి అధిష్టానంలో ఈ మార్పు వచ్చిందని ఆరోపిస్తున్నారు. టిడిపి ఉచ్చులో బిజెపి చిక్కుకొందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందేమీ లేదంటూ తొలిసారిగా వైసీపీ నేతలు విమర్శించారు. దీంతో ఏపీ బిజెపి-వైసీపీ నేతల మద్య మాటల యుద్ధం మొదలైంది.

Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?

రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో హటాత్తుగా ఇంత వేడి పెరిగినా టిడిపి నేతలు ఎవరూ స్పందించలేదు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారిగా నిన్న అమిత్‌ షా విమర్శలను ప్రస్తావించారు.

“సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోకే అత్యంత అవినీతిపరుడని అంటారు. జగన్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోందని అంటారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి వల్లె వేయడమేనా లేక ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొంటుందా?”అని సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత

చంద్రబాబు నాయుడు-అమిత్‌ షా భేటీలో ఏం మాట్లాడుకొన్నారో తెలీదు కానీ బిజెపి ఎప్పటిలాగే వైసీపీ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తే టిడిపి చూస్తూ ఊరుకోదని చంద్రబాబు నాయుడు నిన్న చాలా స్పష్టంగానే సూచించారని భావించవచ్చు. ఇంతకాలం చాలా సంయమనం పాటించిన చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఉద్దేశ్యించి ఇంత ఘాటుగా నిలదీయడం గమనిస్తే, బిజెపితో పొత్తుల కోసం తామేమీ వెంపర్లాడటం లేదని చెప్పిన్నట్లే భావించవచ్చు.




ఒకవేళ బిజెపి అధిష్టానం జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి రహస్య అవగాహన వద్దనుకొంటే తప్పకుండా కేసులలో కదలికలు మొదలవుతాయి. లేకపోతే బిజెపి-వైసీపీ నేతలు కత్తియుద్ధాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూనే ఎన్నికల వరకు కాలక్షేపం చేసేయవచ్చు.

Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్‌, జగన్‌లని టచ్ చేయగలరా?