టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చాలా జాగ్రత్తగానే మాట్లాడుతుంటారు. కనుక ఆయన మాటలలో తప్పులు వెతకడం వృధా ప్రయాసే అవుతుంది. అయితే ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులతో సమావేశనప్పుడు, వైసీపీ నేతల అరాచకాలు ఏ స్థాయికి పెరిగిపోయాయో వివరించే క్రమంలో, “నేడో రేపో వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించవచ్చు. నాపై దాడులు కూడా చేయించవచ్చు,” అని అన్నారు.
ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తను పట్టుకొని చంద్రబాబు నాయుడుకి ఐటి నోటీస్ వచ్చిందని, ఆయన రూ.118 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళకతప్పదని గట్టిగా వాదిస్తూ, దీనిని వైరల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
దీని గురించి పదేపదే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలు అనుమానించేలా చేయాలని, వారి ముందు దోషిగా నిలబెట్టి టిడిపిని రాజకీయంగా దెబ్బ తీయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వారి వాదనలను పట్టించుకోకపోవడంతో వైసీపీ నేతలు నిరాశ చెందుతున్నారు.
సరిగ్గా ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడే స్వయంగా “రెండు మూడు రోజులలో నన్ను అరెస్ట్ చేయవచ్చు,” అంటూ చెప్పడంతో వైసీపీ నేతలకు ఆయనే అవకాశం కల్పించిన్నట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, “రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసకరపాలన సాగుతోంది. దీనిని ఎదుర్కోవాలంటే ప్రతీ ఇంటికి ఒకరు చొప్పున ముందుకు రావాలి. నేను, టిడిపి నేతలు, కార్యకర్తలు అందరూ వైసీపీని ఎదుర్కొని పోరాడుతూనే ఉన్నాము. వీరి అరాచకపాలన ఏ స్థాయికి చేరుకొందంటే ఎవరు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్ట్ చేయడం వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేడో రేపో వాళ్ళు నన్ను కూడా అరెస్ట్ చేయవచ్చు. నాపై కూడా దాడికి ప్రయత్నించవచ్చు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను లోపల వేసేందుకు నాపై అనేక కేసులు పెట్టారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నేను ఎప్పుడూ నిప్పులాగే బ్రతికాను కనుక. నాపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా వాటిలో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి నన్నేమి చేయగలడు?” అని అన్నారు.



