రాష్ట్ర బీజేపీ నేతలు పూర్తిగా సిగ్గు వదిలేసినట్టుగా కనిపిస్తుంది. నిన్న దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం లాఠీఛార్జీకి దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్లమెంట్ వైపు వెళ్తుండగా కేంద్ర ప్రభుత్వం పోలీసులు విచ్చలవిడిగా వారిపై లాఠీలు ఝుళిపించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రప్రయోజనాల కోసం పోరాడిన వారిపై లాఠీ ఝుళిపించినందుకు కనీసం సిగ్గు పడకపోగా… కేంద్రం రాష్ట్రానికి అన్నీ ఇచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పు దారి పట్టిస్తోందని కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం చేసిన పనికి సిగ్గు పడకపోగా కేంద్రం అన్నీ ఇచ్చేసింది అంటూ వారికి వంత పడటం ఇక్కడి బీజేపీ నేతలకే చెల్లింది.
కాన్వాయ్‌ను అడ్డుకున్న భాజపా నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి మోదీ ఏంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండేందుకు భాజపా నేతలకు అర్హత లేదన్నారు. రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మోదీ ముంచేశారని విమర్శించారు. అయినా రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఎంతో చేసింది అంటూ కొందరు నేతలు ముఖ్యమంత్రితోనే వాదనకు దిగడం గమనార్హం. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఢిల్లీ పెద్దల అడుగులు మడుగులు వత్తితే డిపాజిట్లు రాకుండా ఏమవుతుంది? తెలంగాణ ఫలితాల తరువాత కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఎలా? అక్కడ కనీసం ఒక సీటైనా గెలిచారు ఇక్కడ కనీసం ఒక్క సీట్లో అయినా డిపాజిటు దక్కే పరిస్థితి ఉందా?



