ఎవరు ఎంత ఎదిగిన తల్లితండ్రుల ముందు పిల్లలే అన్నది ఎంత వాస్తవమో, ఎవరు ఏ స్థాయిని అందుకున్నా గురువు ముందు శిష్యులే అన్నది కూడా అంతే యదార్ధం. తాజాగా జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలు ఈ వాస్తవాన్ని మరో సారి నిర్ధారించాయి.
ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా టీడీపీ పార్టీ నుంచి బయటకొచ్చి తెరాస ను స్థాపించిన కేసీఆర్ సుదీర్ఘకాలం తన లక్ష్య ఛేదనకు పొత్తులతో రాజకీయ పోరాటం చేస్తూనే వచ్చారు. 2001 లో తెరాస తో మొదలైన కేసీఆర్ నాయకత్వ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు బిఆర్ఎస్ తో 2025 వరకు వచ్చింది.
అయితే ఇక్కడ 2014 లో ప్రత్యేక తెలంగాణ లక్ష్యాన్ని అందుకున్న కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణలో బిఆర్ఎస్ తో రాజ్యమేలారు. ఆ దశాబ్ద కాలంలో తనకు అందివచ్చిన అవకాశంతో ప్రత్యర్థి పార్టీలను అధః పాతాళానికి తొక్కారు. చివరికి తనకు రాజకీయ అవకాశం కల్పించిన టీడీపీ పార్టీ ని సైతం తెలంగాణ లో సమాధి చేయగలిగారు.
‘తెలంగాణ’…అనే ఒకే ఒక్క సెంటిమెంట్ ను అడ్దుపెట్టుకుని ఇదంతా చేయగలిగిన కేసీఆర్ చివరికి అదే కుటుంబ సెటిమెంట్ కు బలయ్యి తన ఉనికి కోసం, పార్టీ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నారు. అయితే తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన టీడీపీ ని తనకు రాజకీయ అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడిని కేసీఆర్ అధికారం చాల తక్కువంచన వేసిందనే చెప్పాలి.
టీడీపీలో పుట్టి టీడీపీలో ఎదిగి చివరికి అదే టీడీపీ ని నాశనం చేయడానికి పూనుకున్న కేసీఆర్ ను నాటి బిఆర్ఎస్ నేతలు ‘గురువుని మించిన శిష్యుడు’ మా నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. బాబు వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన కేసీఆర్ తన రాజకీయంతో అదే బాబు కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగారు అంటూ నాడు కేసీఆర్ పై ప్రసంశల జడివాననే కురిపించారు.
అయితే కేసీఆర్ ఇచ్చిన ఒక్క రిటర్న్ గిఫ్ట్ తో కేసీఆర్ ఆకాశమంత ఎదిగిపోయారు, బాబు పాతాళానికి పడిపోయారు అంటూ నాడు కేసీఆర్ అభిమానులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్క విజయమో, ఒక్క పరాభవమో టీడీపీ ఉనికిని ప్రశ్నించలేదని, బాబు నాయకత్వాన్ని కుంగదీయలేదని 2024 ఎన్నికలతో బాబు 164 సీట్ల భారీ విజయంతో నిరూపించుకున్నారు.
ఒక్క ఓటమి, ఐదేళ్ల అవమానాలు, ప్రత్యర్థుల వికటాట్టహాసాలు, తెరచాటు రాజకీయాలు, 40 ఏళ్ళ రాజకీయ జీవితానికి ఎన్నో అడ్డంకులు, మరెన్నో చీకటి రోజులు…ఇవన్నీ కలిసి కూడా చంద్రబాబు నాయుడిని ఇంచు కూడా భయపెట్టలేకపోయాయి, అలాగే టీడీపీ పార్టీ ఉనికిని దెబ్బకొట్టలేకపోయాయి.
కానీ 2023 బిఆర్ఎస్ ఓటమి కేసీఆర్ ను రాజకీయంగా మూగవాడిని చేసేసింది. ఇటు పార్టీ పరంగాను అటు కుటుంబ పరంగాను కేసీఆర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయులుగా మిగిలిపోయారు. గురువుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానన్న ఆనందం కేసీఆర్ కు ఆ ఒక్క ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యింది.
కానీ అదే గురువు నుంచి పరోక్షంగా బిఆర్ఎస్ కు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ తో ఇప్పుడు కేసీఆర్ తన పార్టీ అస్తిత్వం కోసం సొంత సంతానంతో పోరాటం చెయ్యాల్సిన పరిస్థితిలు ఎదురయ్యాయి. కేసీఆర్ మాదిరి బాబు బిఆర్ఎస్ మీద కానీ కేసీఆర్ మీద కానీ రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నడూ నోరు జారలేదు.
ఓటుకు నోటు అంటూ ఒకసారి, రిటర్న్ గిఫ్ట్ అంటూ మరోసారి కేసీఆర్ తన రాజకీయ గురువు మీద పై చేయి సాధించారని సంబరపడినప్పటికీ “గురువెప్పటికి గురువే శిష్యా” అనేది కేసీఆర్ కు ఇప్పుడు తెలిసొస్తుంది. కేసీఆర్ మాదిరి బాబు ఓటమికి కుంగిపోలేదు, సంక్షోభాలకు లొంగిపోలేదు. కష్టంలో ఉన్నప్పుడు కుటుంబమంతా బాబు కోసం, పార్టీ కోసం తమవంతు చేయూత నిచ్చారు.
అలాగే పార్టీ నుండి ఎదిగిన ఎంతో మంది నాయకులు పార్టీకి తనకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినా, హద్దులు దాటి తనను తన కుటుంబాన్ని అవమానించినా బాబు ఎన్నడూ అవమానాలకు తలవంచలేదు. విమర్శలను లెక్కచేయ్యలేదు. నలభై ఏళ్ళ రాజకీయ జీవితం, నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అనుభవం, పద్నాలుగేళ్ల ప్రతిపక్ష హోదా ఇవేమి కూడా బాబు ని రాజకీయ లక్ష్మణ రేఖ దాటించలేకపోయాయి.
ఏడు పదుల వయస్సులోనూ తన మార్క్ రాజకీయం చేస్తూ తెలుగు జాతి అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉంటుందని, సదా మీ సేవలో అంటూ బాబు మహానాడు సాక్షిగా తెలుగు ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ తన కూతురు లేఖలతో తనకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ లను చదువుకుంటూ ప్రజల ముందుకు రాలేక ముఖం చాటేస్తున్నారు.




