రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తనకు ఎదురే ఉండకూడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్ టిడిపిని నిర్వీర్యం చేసేశారు. ఆ సమయంలో ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గురించి కేసీఆర్ చాలా అవహేళనగా మాట్లాడేవారు.
జగన్ లాగే కేసీఆర్ కూడా చంద్రబాబుపై పగ, ద్వేషంతో రగిలిపోయేవారు. ఇద్దరూ కలిసి ఆయనను గద్దె దింపేవరకు నిద్రపోలేదు.
గత ఏడాది చంద్రబాబు నాయుడుని జగన్ జైల్లో పెట్టించినప్పుడు, తెలంగాణ సిఎంగా ఉన్న కేసీఆర్ ఖండించలేదు. పైగా చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ హైటెక్ సిటీ వద్ద ఆందోళన చేస్తున్న ఐటి ఉద్యోగులకు కొడుకు కేటీఆర్ చేత వార్నింగ్ ఇప్పించారు కూడా.
కానీ గమ్మతు ఏమిటంటే ఇప్పుడు అదే కేటీఆర్ ఏపీలో టిడిపిని చూసి నేర్చుకోమని కాంగ్రెస్ ఎంపీలకు సుద్దులు చెపుతున్నారు.
నేడు సింగరేణి పరిధిలోని శ్రావణపల్లి బొగ్గుగనిని కేంద్ర ప్రభుత్వం వేలం వేయబోతోంది. దానిపై కేటీఆర్ స్పందిస్తూ, “తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 మంది ఎంపీలను ఇస్తే అవి సింగరేణిని కాపాడే ప్రయత్నం చేయకుండా, సింగరేణి కి దక్కాల్సిన బొగ్గు గనిని వేలం వేసేస్తున్నాయి. ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది?
అదే… ఏపీ ప్రజలు టిడిపిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు వెంటనే చక్రం తిప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రక్రియని నిలిపివేయించారు. టిడిపిని చూసి కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని శ్రావణపల్లి గని సింగరేణికి దక్కేలా చేయాలి,” అని అన్నారు.
దేశంలో అందరి కంటే గొప్ప రాజకీయ మేధావిని అని భావించే కేసీఆర్, ఏపీలో కూడా తన పార్టీని విస్తరించాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తానే కొనేసి కాపాడేస్తానంటూ హడావుడి చేసి చివరికి చేతులెత్తేశారు.
కానీ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని చంద్రబాబు నాయుడు కాపాడుకున్నారని ఆయన కొడుకు కేటీఆర్ చెపుతుండటం విశేషం.
బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తమిళనాడులో ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని మనం పనిచేయాలని కేసీఆర్ తన పార్టీ నేతలకు చెపుతున్నారు. అయితే టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకొని జాతీయరాజకీయాలు, జాతీయవాదం అంటూ మాట్లాడిన నోటితోనే కేసీఆర్ ఈవిదంగా ప్రాంతీయవాదాన్ని బలపడాల్సిన అవసరం ఉందని చెప్పడాన్ని ఏమనుకోవాలి? అంటే ఆయన జాతీయవాదం అంతా ఉట్టిదేనా? బిఆర్ఎస్ విషయంలో తన ఆలోచనా విధానం సరికాదని చెప్పుకుంటున్నారా?లేదా దేశంలో తనకంటే చాలా మంది మేధావులు ఉన్నారని గ్రహించారా?
ఏది ఏమైనప్పటికీ, అహంభావంతో విర్రవీగేవారికి, అసూయ, ద్వేషాలతో రగిలిపోయేవారికి చివరికి ఎలాంటి దుర్గతి పడుతుందో గ్రహించేందుకు వీరిద్దరే ప్రత్యక్ష నిదర్శనమని భావించవచ్చు.




