విభజన సమస్యల కంటే వారితోనే పెద్ద సమస్య… ఎలా?

Chandrababu-Naidu-.Revanth-Reddy

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డికి నిన్న ఓ లేఖ వ్రాశారు. ఈ నెల 6వ తేదీన తాను హైదరాబాద్‌ వచ్చి కలుస్తానని, ఇరువురం కూర్చొని రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకుందామని దానిలో ప్రతిపాదించారు. పరస్పరం సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు లేఖలో వ్రాశారు. తెలంగాణ సిఎంకు లేఖ వ్రాసిన విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశారు.

ఏపీలో టిడిపి కూటమి విజయం సాధించిన తర్వాత తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు. కనుక ఇరువురి భేటీ ఖాయమే.

ADVERTISEMENT

విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా అనుకూలమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. రేవంత్‌ రెడ్డి గతంలో టిడిపిలో ఉన్నందున ఇరువురి మద్య సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారినందున విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కూడా సహకరించవచ్చు.

అయితే ఇరువురు ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించేందుకు పూనుకోగానే, అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌ రాజకీయాలు మొదలుపెట్టేయడం కూడా ఖాయమే. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ ఎన్నికలలో ఓడిపోవడంతో వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇద్దరూ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా అప్రదిష్టపాలయ్యారు. ఈ కారణంగా ఇద్దరూ ప్రజల మద్యకు వెళ్ళలేకపోతున్నారు.

అక్కడ రేవంత్‌ రెడ్డిని, ఇక్కడ చంద్రబాబు నాయుడుని దెబ్బ తీసేందుకు సరైన అవకాశం కోసం కేసీఆర్‌, జగన్‌ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిల భేటీతో వారికి ఆ అవకాశం లభించబోతోంది. తాము మొదటి నుంచి వాదిస్తున్నట్లే చంద్రబాబు నాయుడు రేవంత్‌ రెడ్డి ద్వారా తెలంగాణపై మళ్ళీ పెత్తనం సాగించేందుకు వచ్చారని, రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా చంద్రబాబు నాయుడుకి రాష్ట్రాన్ని దోచిపెట్టేస్తున్నారంటూ కేసీఆర్‌ రాజకీయాలు మొదలుపెట్టడం ఖాయం.

అదేవిదంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రా ప్రయోజనాలను కాపాడకుండా రేవంత్‌ రెడ్డితో లులూచీ అవుతున్నారని ఆరోపిస్తూ జగన్‌ కూడా రాజకీయాలు మొదలుపెట్టడం నూటికి నూరు శాతం ఖాయమే.

ఈ వంకతో మళ్ళీ బిఆర్ఎస్, వైసీపిలు బలపడేందుకు గట్టిగా ప్రయత్నించక మానవు. అదే జరిగితే చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డికి మళ్ళీ కొత్త తలనొప్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

కనుక ఇరువురు ముఖ్యమంత్రులకు విభజన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు ఇరువురు మాజీలు చేయబోయే ఈ రాజకీయాలను కూడా అంతే సమర్ధంగా ఎదుర్కోక తప్పదు.

రెండు రాష్ట్రాల మద్య సత్సంబంధాలు, పరస్పర సహకారం, విభజన సమస్యల పరిష్కారం ఎంత అవసరమో ప్రజలకు వివరించడం చాలా అవసరం. ఇంతకాలం జగన్, కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని, దాని వలనరెండు రాష్ట్రాలకు కలిగిన నష్టాల గురించి వారి కంటే ముందుగానే చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి ప్రజలకు వివరించగలిగితే, వారు రాజకీయాలు చేయకుండా నిలువరించవచ్చు.

Chandrababu Letter To Revanth Reddy

ADVERTISEMENT
Latest Stories