భారత్ పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల సేపు జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ పాలుపంచుకునేందుకు బిల్ గేట్స్ అంగీకరించారు.
ముఖ్యంగా విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాలలో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయ సహకారాలు అందించనుంది. ఈ మేరకు నేడు గేట్స్ ఫౌండేషన్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్య ఢిల్లీలో ఒప్పందం జరుగనుంది.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్-సిఎం చంద్రబాబు నాయుడు కలిసి దిగిన తాజా ఫోటో ఒక్కటే పెట్టుబడిదారులకు ముఖ్యంగా ఐటి కంపెనీలకు ఓ సానుకూల సంకేతం పంపిన్నట్లవుతుంది.
గేట్స్ ఫౌండేషన్ ఈ మూడు రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందనే వార్త, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులను, ఐటి కంపెనీలు కంపెనీల దృష్టిని తప్పక ఆకర్షిస్తుంది.
గేట్స్ ఫౌండేషన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు రంగాలలో పనిచేయబోతోందని తెలిసి, ఈ మూడు రంగాలతో పాటు వివిద రంగాలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.
కనుక బిల్ గేట్స్‌తో సిఎం చంద్రబాబు నాయుడి ఈ సమావేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు శ్రీకారంగా భావించవచ్చు. వీరి సమావేశం రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఐటి కంపెనీలను రప్పిస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడవచ్చు.




