శనివారం సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్రమోడీలతో భేటీ అయ్యేందుకే వెళుతున్నట్లు తాజా సమాచారం. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత వారు చంద్రబాబు నాయుడుతో ముఖాముఖీ సమావేశం కాబోతున్నారు.
ఇటీవల సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడుకి ఢిల్లీ నుంచి కబురు రావడం గమనార్హం. కనుక ఈ సమావేశం తర్వాత ఏపీ రాజకీయాలలో ఏదో పెనుమార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ఏపీ రాజకీయాల గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవలసి ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో అనిశ్చిత రాజకీయ వాతావరణం నెలకొని ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేసినా మూడు రాజధానులు ఏర్పాటు చేయలేకపోవడం, పోలవరం ప్రాజెక్టుపై చేతులు ఎత్తేయడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడం, ప్రజలపై పన్నులు, ఛార్జీల భారం పెంచుకుపోతుండటం వలన ప్రజలలో నానాటికీ అసంతృప్తి పెరుగుతోంది.
దీంతో ప్రజలు టిడిపి, జనసేనలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా సహజం. కానీ సంక్షేమ పధకాలే తమను గట్టెక్కిస్తాయని వైసీపీ నమ్మకంగా ఉంది.
ఈ కారణంగా రాష్ట్ర ప్రజలు మూడు పార్టీల మద్య చీలిపోయున్నారు. ఇదే… రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి ప్రధాన కారణం. ఇటు టిడిపి-జనసేనలు, అటు వైసీపీ ఎన్నికలలో మేమే గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్నాయి కానీ వాటికి ఓట్లేసే రాష్ట్ర ప్రజలు మాత్రం వాటిలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేకపోతున్నారు.
ఏపీలో ఈ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగానే గమనిస్తోంది. కానీ బిజెపి ప్రయోజనాలు కూడా అది చూసుకోవాలి కనుక ఎటువైపు మొగ్గాలో ఇంకా నిర్ణయించుకొన్నట్లు లేదు.
ఒకవేళ మళ్ళీ టిడిపి, జనసేన, బిజెపి కూటమికి సిద్దపడితే ఆ కూటమికి తిరుగే ఉండదు. ఒకవేళ వైసీపీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేతులు కలిపినా, ఏపీలో వైసీపీ తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు.
కానీ ఏపీలో ఏ పార్టీ లేదా కూటమి గెలిచినా బిజెపి అధిష్టానానికి పెద్దగా పట్టింపులేదు కానీ వాటిలో ఏది గెలిచినా సరే లోక్‌సభ ఎన్నికల తర్వాత అవసరమైతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి బిజెపికి తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని కోరుకొంటోంది. బహుశః అందుకే ఏపీలో ఎవరితో చేతులు కలపాలని ఆలోచిస్తోంది.
ఓ వైపు కేసులు, మరోవైపు అప్పులతో సతమతమవుతున్న వైసీపీని చెప్పుచేతలలో ఉంచుకోవడం కేంద్రానికి సులువే. కానీ ఏపీకి తీరని నష్టం, అన్యాయం జరుగుతున్న కేంద్రం పట్టించుకోవడంలేదని ఆంధ్రా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం కూడా మోడీ, అమిత్ షాలకు తెలుసు.
కనుక టిడిపి, జనసేనలతో చేతులు కలిపి ఇక్కడా, అక్కడా అధికారంలోకి వచ్చి అమరావతి, పోలవరం పనులను మళ్ళీ వేగవంతం చేయడం ద్వారా బిజెపి పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గుతుంది. ఏపీ బిజెపి భవిష్యత్‌కు ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఒకవేళ శాసనసభ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినా, అవసరమైతే కేంద్రానికి అండగా నిలబడక తప్పదు. ఎందుకంటే, ఇంతకాలం టిడిపి, జనసేనలను వేటాడి, వేధించినందుకు జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలందరిపై ప్రతీకారం తీర్చుకొంటామని టిడిపి, జనసేనలు బహిరంగంగానే చెపుతున్నాయి. కనుక అప్పుడు రక్షణ కోసం కేంద్రాన్ని ఆశ్రయించక తప్పదు కనుక ఉన్న ఎంపీలతో కేంద్రానికి మద్దతు ఇవ్వక తప్పదు.
ఈ లాభనష్టాల లెక్కలన్నీ బేరీజు వేసుకొన్న తర్వాతే మోడీ, అమిత్ షాలు చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారు. కనుక టిడిపి, జనసేనలతో బిజెపి కలుస్తుందో లేదో తేలిపోయే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ఏపీలో మూడు ప్రధాన పార్టీల బలాబలాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.