వాటి ఆరాటం పొత్తులకు కాదు… ఆశీర్వాదాల కోసమే!

Chandrababu-Naidu-Narndra-Modi-JP-Nadda-Amit-Shah-Pawan-Kalyan-Jaganఏపీలో ఇటు అధికార వైసీపీ, అటు ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి రెండూ కూడా బిజెపికి అంటే… దాని ఢిల్లీ పెద్దలకి దగ్గరవ్వాలనుకొంటున్నాయి. ఇక మరో ప్రతిపక్ష పార్టీ జనసేన ఎప్పటి నుంచో బిజెపితో పొత్తులో ఉంది. ఈవిదంగా ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఢిల్లీ పెద్దల గుప్పెట్లో ఉన్నాయి.

నిజానికి టిడిపి, వైసీపీ, జనసేన మూడు పార్టీలు కూడా ఏపీ బిజెపితో పొత్తుల కంటే దాని ఢిల్లీ పెద్దలతో సఖ్యత మాత్రమే కోరుకొంటున్నాయని చెపొచ్చు. అందుకు ఒక్కో పార్టీకి ఒక్కో కారణం ఉంది. అది అందరికీ తెలుసు.

ADVERTISEMENT

అయితే టిడిపి, వైసీపీలలో ఏదైనా బిజెపితో పొత్తులు పెట్టుకొంటే, అదే… వాటి ప్రత్యర్ధి పార్టీకి ఆయుధంగా మారుతుందని కూడా వాటికి తెలుసు. ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వేజోన్, కాకినాడ పెట్రో కారిడార్, మెట్రో తదితర విభజన హామీలను అమలుచేయకపోగా, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా దానిని మోడీ ప్రభుత్వం అమ్మిపడేస్తోంది.

ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మించకుండా కాలక్షేపం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనుక ఏపీ బిజెపితో ఏ పార్టీ పొత్తులు పెట్టుకొన్నా, దాని రాజకీయ ప్రత్యర్దులు, ప్రజలు, మీడియా తప్పకుండా ప్రశ్నించడం ఖాయమే.

పైగా బిజెపితో పొత్తులు పెట్టుకొంటే రాష్ట్రంలో ముస్లిం, క్రీస్టియన్ మతంలోకి మారుతున్న లక్షలాదిమంది బడుగు బలహీనవర్గాల ప్రజలు కూడా దూరం అవుతారు. ఇది పార్టీల విజయావకాశాలను తారుమారు చేస్తుంది.

ఈవిషయం టిడిపి, వైసీపీ, జనసేన మూడు పార్టీలకు బాగా తెలుసు. ఈ కారణంగానే వైసీపీ బిజెపితో నేరుగా పొత్తులకు ఆసక్తిచూపడం లేదు. నిజానికి టిడిపి, జనసేనల ఆలోచన కూడా అదే అని చెపొచ్చు.

ఇదెలా ఉందంటే అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి సాయం కోరేందుకు అర్జునుడు, దుర్యోధనుడు వెళ్ళినప్పుడు, “నేనొక్కడినే ఒకవైపు, నా సైన్యమంతా మరో వైపు… మాలో ఎవరు కావాలో కోరుకొమ్మని” శ్రీకృష్ణుడు అడిగితే, శ్రీకృష్ణుడు ఒక్కడే చాలంటాడు అర్జునుడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి సైన్యం కోసమే వస్తాడు. ఆయనకు అదే దొరికింది కనుక సంతోషపడతాడు.

కానీ ఇప్పుడు టిడిపి, వైసీపీ, ఇంకా చెప్పాలంటే జనసేన కూడా శ్రీకృష్ణుడినే… అంటే కేంద్రప్రభుత్వం సహాయసహకారాలను మాత్రమే కోరుకొంటున్నాయని చెపొచ్చు. కాదని సైన్యాన్ని… అంటే ఏపీలో బిజెపితో పొత్తులు కోరుకొంటే ఏమవుతుందో ముందే చెప్పుకొన్నాము.

ఈవిషయం మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలకు కూడా బాగా తెలుసు. అందుకే నిద్రనటిస్తూ మూడు పార్టీలను వెయిటింగులో ఉంచుతున్నట్లు భావించవచ్చు. కనుక ఈ పొత్తుల కధ చాలా సంక్లిష్టమైనదే అని భావించవచ్చు. అందుకే టిడిపి, వైసీపీ, జనసేనలు కూడా ఏపీ బిజెపితో అంటకాగాలని ఆరాటపడటం లేదు. కానీ ఏదో ఓ రోజున ఈ డ్రామాకు ముగింపు పలికక తప్పదు. అది ఏవిదంగా ఉండబోతోందో చూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories