ఆలస్యం… నమ్మకం… మిత్రులు… మోడీ మాటలు..!

Narendra modi - chandrababunaiduఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా హస్తిన వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి గట్టి హామీనే లభించినట్లు తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అయినా భేటీలో చంద్రబాబుకు మోడీ ఏ మేర హామీ ఇచ్చారన్న విషయంపై ఓ తెలుగు దినపత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

ADVERTISEMENT

ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగీ దిగగానే నేరుగా సౌత్ బ్లాక్ వెళ్లిన చంద్రబాబు ప్రధానితో సమావేశమయ్యారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ తర్వాత ప్రధాని కార్యాలయం నుంచి చంద్రబాబు కాస్తంత ధీమాగానే బయటకు వచ్చారు. భేటీలో జరిగిన చర్చలపై సదరు పత్రిక రాసిన కథనం ప్రకారం… “మీ రాష్ట్రం పరిస్థితి మాకు తెలుసు. మేం ఏం చేయగలమో తప్పక చేస్తాం. ఇప్పటికే ఆలస్యమైన మాట నిజమే. సమస్యలు పరిష్కరిస్తాం. మా మీద నమ్మకముంచండి” అని చంద్రబాబుకు మోడీ గట్టిగానే హామీ ఇచ్చారు.

భేటీ ముగియగానే బయటకు వచ్చిన చంద్రబాబు హావభావాలలో ఆత్మవిశ్వాసం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. “మీరు మా మిత్రులు, బాగా కష్టపడతారు, మీకు బాగా అనుభవం ఉంది” అంటూ ప్రధాని చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మిత్రపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాని తన వ్యక్తిగత మిత్రుడిగానూ అభివర్ణించడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories