నవ్యాంధ్రప్రదేశ్ లో కొత్త పని విధానం దాదాపుగా అమల్లోకి వచ్చేసింది. వారానికి ఐదు రోజుల పాటు పనిచేసి మిగిలిన రెండు రోజులు సెలవుగా తీసుకునే వెసులుబాటును ఉద్యోగులకు కల్పించాలన్న ప్రతిపాదనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బుధవారం నాడు జరిగిన సమీక్షల సందర్భంగా మంత్రి నారాయణ బృందం రూపొందించిన ఈ ప్రతిపాదనను ఏడాది పాటు అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త పని విధానం ప్రస్తుతం హైదరాబాదులో పనిచేస్తూ… ప్రభుత్వం నిర్దేశించిన జూన్ లోగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలిపోయే ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది.
హైదరాబాదులో కుటుంబాలు ఉన్నా, అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. అమరావతిలో వసతి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కుటుంబాలతో సహా ఉద్యోగులు హైదరాబాద్ ను వీడటం దాదాపుగా అసాధ్యమన్న బావనతోనే ఈ ప్రతిపాదన రూపుదాల్చింది. ఏడాదిలోగా అమరావతిలో వసతి సౌకర్యాలు మెరుగుపడతాయని, అప్పటిదాకా అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నారాయణ అధికారికంగా ప్రకటించారు.



