మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళివస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఓసారి ప్రచారానికి వెళ్ళిరాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీయే అభ్యర్ధుల ప్రచారానికి వెళ్ళబోతున్నారు.
ముందుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శని, ఆదివారం రెండు రోజుల పాటు మహారాష్ట్రాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారని జనసేన సోషల్ మీడియాలో వెల్లడించింది. రెండు రోజులలో 5 బహిరంగ సభలు, రెండు రోడ్ షోలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలియజేసింది.
సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు సమాచారం. అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధులు, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు, రాష్ట్రానికి సంబందించిన అంశాలపై మాట్లాడేందుకు వెళుతున్నట్లు సమాచారం. ఆ తర్వాత వీలుని బట్టి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నట్లు సమాచారం.
అయితే సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనల గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. ప్రస్తుతం కీలకమైన బడ్జెట్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ సభలో లేకపోతే విమర్శలకు తావిచ్ఛిన్నట్లఅవుతుంది కనుక పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళతారేమో?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ ‘ఆహా ఓహో’ అన్నారు. కానీ ఏడాదిలోపే అందరూ పెదవి విరుస్తున్నారు.
కనుక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం అక్కడి కాంగ్రెస్ పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చెపుతున్న ‘డబుల్ ఇంజన్ సర్కార్’ (కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు) ఉంటే ఆ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెపుతుంటారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది.
కేవలం 5 నెలల వ్యవధిలోనే అమరావతి, పోలవరం నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి. సుమారు రూ.1.75 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ఏపీ జెన్‌కో కలిసి సుమారు లక్ష కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో గ్రీన్ సిగ్నల్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాయి. ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోడీ దానికి శంకుస్థాపన చేయబోతున్నారు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి వీటి గురించి వివరిస్తే బీజేపీ పట్ల మహారాష్ట్ర ప్రజలకి నమ్మకం పెరుగుతుంది. ఎన్నికలలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.




