టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకొనేందుకు ఓ వైపు వైసీపీ శ్రేణులు, మరోవైపు పోలీసులు గట్టిగా ప్రయత్నించడంతో ఘర్షణలకు దారి తీసింది. అంగళ్ళు గ్రామంలో చంద్రబాబు నాయుడు, టిడిపి కార్యకర్తలపై రాళ్ళతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, పుంగనూరులో కూడా దాడి చేశారు. దాంతో సహనం కోల్పోయిన టిడిపి కార్యకర్తలు కూడా ఎదురుదాడి చేయడంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.
ఓ ప్రతిపక్షనాయకుడు ప్రజల మద్యకు వస్తే ఆయనకు భద్రత కల్పించి ఆయన పర్యటన సజావుగా పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆ జిల్లా పోలీసుల మీదే ఉంటుంది. కానీ ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించి, వైసీపీ కార్యకర్తలు నిరసనలు తెలిపేందుకు అనుమతించడం విశేషం. ఈ గొడవలకు ఇదే కారణంగా కనిపిస్తోంది.
కానీ చంద్రబాబు నాయుడు టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై కూడా దాడి చేయించారని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు. టిడిపి కార్యకర్తలు దాడులలో పలువురు పోలీసులు గాయపడ్డారని, పరిస్థితులు అదుపుతప్పినందునే టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని అన్నారు. దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలను గుర్తించామని వారందరిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.
టిడిపి, వైసీపీ కార్యకర్తలు ఎదురెదురుపడితే వారి మద్య ఘర్షణలు జరుగుతాయని, ఈవిదంగా పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంటుందని పోలీసులకు తెలుసు. అయినా తమ నాయకుడిని అడ్డుకొని వారిని ఎందుకు అనుమతించరని టిడిపి ప్రశ్నిస్తోంది. పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు నాయుడు ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకొన్నారంటే అర్దం చేసుకోవచ్చు కానీ వైసీపీ కార్యకర్తలు కూడా అడ్డుకొన్నారు. అంటే ముందస్తు పధకం ప్రకారమే ఇదంతా జరిగిన్నట్లు అర్దమవుతోందని టిడిపి నేతలు ఆరోపించారు.
దీనికంతటికి కారణం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు నాయుడు రోడ్ షోకి భారీగా ప్రజలు తరలిరావడం, ఆ సభలో ఆయన వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్‌ను తీవ్రంగా విమర్శించడమే వైసీపీ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. పులివెందులలో చంద్రబాబు నాయుడు సభతో వైసీపీ తీవ్ర అభద్రతాభావానికి గురయిన్నట్లు ఈ భౌతికదాడులు నిరూపిస్తున్నాయి.
అయితే జగన్‌తో సహా ఆయన మంత్రులు నిత్యం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు. రకరకాలుగా అవహేళన చేస్తూనే ఉంటారు. అదే… ప్రతిపక్ష నేతలు తిరిగి విమర్శిస్తే తట్టుకోలేక ఈవిదంగా భౌతికదాడులకు పాల్పడుతున్నారు. వీటితో ప్రతిపక్షాలను అణచివేయగలమని అనుకోవడం చాలా పొరపాటు. ఒకవేళ అదే సాధ్యమైతే టిడిపి ఇన్ని దశాబ్ధాలు మనుగడ సాగించగలిగేదే కాదు కదా?
చంద్రబాబు నాయుడే కార్యకర్తలను ఉసిగొల్పి ఈ దాడులు చేయించారని వైసీపీ వాదిస్తున్నప్పటికీ, ఆత్మసాక్షి ఘోషిస్తున్నప్పటికీ, పోలీసుల చేత కూడా చెప్పించినప్పటికీ, ఈ భౌతికదాడులు వైసీపీ పట్ల రాష్ట్ర ప్రజలలో మరింత విముఖత పెంచుతాయని గ్రహిస్తే మంచిది. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని సాక్షాత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. కనుక ఆయన హెచ్చరికలతో వైసీపీ మేల్కొనకపోగా తగ్గేదేలే అంటూ ఈవిదంగా ఇంకా రెచ్చిపోతుంటే ఏదో ఓ రోజు అదే వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.



