టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి తన హయాంలో ప్రారంభించి నిర్మించిన చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద సెల్ఫీ తీసుకొని దానితో సిఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తన ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి రూ.2,289 కోట్లు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేశామని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కనుక మా హయాంలో చేసిన పనులు ఇవి… జగన్! నువ్వేమి చేశావో చెప్పు? అంటూ చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
అనంతరం ఉమ్మడి జిల్లాలలోని సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కమీషన్ల కక్కుర్తి వలన 2004 నుంచి పదేళ్ళపాటు పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకలు నడవగా మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి మరోసారి ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేశాడని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడి సుమారు ఏడాది పాటు అన్ని పనులు నిలిపివేసి, కాఫర్ డ్యామ్ మద్య కాళీలు అలాగే వదిలేశారని, ఆ కారణంగా 2020లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టులోకి ఒకేసారి 22 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో డయాఫ్రామ్ వాల్వ్ దెబ్బ తిందని వివరించారు.
మంత్రి అంబటి రాంబాబు విమర్శలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులో ఒకదాని తర్వాత మరో పని చేసుకొంటూ వెళితే ప్రాజెక్టు పూర్తిచేయడానికి దశాబ్ధాలు పడుతుందని, కనుక ఒకేసారి వేర్వేరు చోట్ల వేర్వేరు దశల పనులను చేయిస్తుంటారని చెప్పారు. కానీ మంత్రికి ఈ విషయం తెలియకపోవడం వలననే డయాఫ్రామ్ వాల్వ్ అంటూ ఏదేదో మాట్లాడుతుంటారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తమ అసమర్దతను, అవగాహనారహిత్యాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకే ఆవిదంగా ఆరోపిస్తూ కాలక్షేపం చేసేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
దేశంలోనే ఓ విభిన్నమైన ప్రాజెక్టు పట్టిసీమ అని అన్నారు. దానిని కూడా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆనాడు విదేశీయుడైన కాటన్ దొర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సస్యశ్యామలం అయ్యేందుకు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారని, అందుకు నేటికీ గోదావరి జిల్లాల ప్రజలు ఆయన విగ్రహం పెట్టుకొని దేవుడిలా పూజిస్తుంటారని అన్నారు. ప్రజలకు ఎవరైనా మేలు చేస్తే ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకొంటారని, కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఏం చేశారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ఏపీలో 5 ప్రధాన నాధులు, 69 ఉపనదులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొంటే రాష్ట్రమంతటా సాగు,త్రాగు నీటిని అందించవచ్చని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగుప్రాజెక్టులన్నిటినీ పూర్తిగా భ్రష్టు పట్టించేశారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిగో గత టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 72 శాతం పనులను పూర్తి చేసి, సగర్వంగా నేను సెల్ఫీ తీసుకున్నా. జగన్ కు ఇదే నా సవాల్. వైసీపీ ప్రభుత్వం ఎంతమేర పనులు చేసిందో చెప్పాలి. – జగన్‌కు చంద్రబాబు గారి సెల్ఫీ ఛాలెంజ్ #SelfieChallengeToJagan#CBNinPolavaram… pic.twitter.com/gRRyQOLzc8
— Telugu Desam Party (@JaiTDP) August 7, 2023



