హంద్రీ-నీవా కల కాదు.. నిజమే ఇవిగో నీళ్ళు..

Chandrababu Naidu Revives Handri-Neeva Project

రాష్ట్ర ప్రజలు చాలా కాలంగా ‘హంద్రీ-నీవా ప్రాజెక్ట్’ పేరు వింటూనే ఉన్నారు. కానీ దాని ప్రాధాన్యత ఏమిటో తాగు,సాగు నీటి కోసం కటకటలాడుతున్న రాయలసీమ ప్రజలకు మాత్రమే తెలుసు.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా నంది కొట్కూరు మండలంలోని మాల్యాల పంప్ హౌసులో మోటర్లు ఆన్‌ చేసి సీమజిల్లాలకు 4 టీఎంసీల నీళ్ళు విడుదల చేశారు.

ADVERTISEMENT

2014-19 లోనే ఈ ప్రాజెక్ట్ కాలువ పనులు చాలా వరకు పూర్తి చేసి, మాల్యాల పంప్ హౌసులో మోటర్లు కూడా బిగించి ట్రయల్ రన్స్ కూడా నిర్వహించారు. కానీ దీనిని కూడా జగన్‌ అమరావతిలాగే పాడుబెట్టేశారు. ఎందువల్ల అంటే దీనిని చంద్రబాబు నాయుడు నిర్మించారు కనుకనే!

ఆయనపై ద్వేషంతో‘హంద్రీ-నీవా ప్రాజెక్ట్’ని అసలు పట్టించుకోలేదు. ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా ఈ ప్రాజెక్టులో మిగిలిన కాలువ లైనింగ్ పనులను పూర్తిచేయకుండా విడిచిపెట్టేశారు. కనీసం బిగించి సిద్దంగా ఉన్న మోటర్లను కమీషనింగ్ చేయించి ఆ కాలువలలోనే నీటిని విడుదల చేయవచ్చు. కానీ అదీ చేయలేదు. కనుక అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు జగన్‌ ముఖ్యమంత్రి కావడంతో సీమ ప్రజలకు 5 ఏళ్ళు నీరందలేదు.

జగన్‌కు సాగునీటి ప్రాజెక్టుల అవసరం తెలీదు. వాటి గురించి అవగాహన కూడా లేదు. కనుక సరిగ్గా తనలాంటి వ్యక్తి అంబటి రాంబాబుని జలవనరుల శాఖ మంత్రిగా నియమించారు. ఆయన ఏం చేశారో, ఏం మాట్లాడేవారో అందరికీ తెలుసు.

ఈరోజు నందికొట్కూరులో జరిగిన సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు పనులను 2025 లోగా పూర్తిచేసి సీమ జిల్లాలకు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే రూ.3,890 కోట్లు వ్యయంతో రేయింబవళ్ళు కాలువ లైనింగ్ పనులు జరిపించి, మోటర్లు కమీషనింగ్ చేయించి రెండు పంపుల ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా నీటిని నేడు విడుదల చేశారు.

జగన్‌ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన హంద్రీ-నీవాలో ఓ తట్ట మట్టి తీయలేదు. ఓ బస్తా సిమెంట్ ఖర్చు చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై నెలకు ఒకటి రెండుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి పనుల పురోగతి తెలుసుకుంటూ శరవేగంగా పూర్తి చేయించారు. దీంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందుతుంది.

ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, కేవలం ఏడాది వ్యవధిలోనే హంద్రీనీవ కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి నీళ్ళు అందించడం సాధ్యం కాదు.. మన దగ్గర అంత డబ్బు లేదని చెపితే డబ్బు సంగతి నేను చూసుకుంటాను.. పనులు ఆపడానికి లేదని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఖరాఖండీగా చెప్పారు. చెప్పినట్లే డబ్బు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయించారు,” అని అన్నారు.

ఈ ప్రాజెక్టులో మిగిలిన పనులు కూడా పూర్తయితే శ్రీశైలం మల్లన్న పంపిన కృష్ణా నీళ్ళు 5-600 కిలో మీటర్లు ప్రయాణించి తిరుమల వెంకన్న పాదాల వరకు చేరుకుంటాయని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories