రాష్ట్రానికి పరిశ్రమలు తేలేక ఉన్నవాటిని కాపాడుకోలేకపోయిన జగన్ ప్రభుత్వానికి ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అవసరమే పడలేదు. పారిశ్రామిక అభివృద్ధి విలువ తెలియని జగన్ ప్రభుత్వం ‘స్కిల్ డెవలప్‌మెంట్’ అంటే కొడాలి నాని మాట్లాడే బూతులన్నట్లు వ్యవహరించింది.
చంద్రబాబు నాయుడుకి ఎంతో పేరు తెచ్చిన ‘స్కిల్ డెవలప్‌మెంట్’నే ఆయుధంగా మలుచుకొని ఆయనని ప్రతిష్టని దెబ్బతీసి, రాష్ట్రంలో నుంచి టిడిపిని నామరూపాలు లేకుండా తుడిచి పెట్టేయాలని జగన్ అనుకున్నారు. అందుకే ‘స్కిల్ డెవలప్‌మెంట్’ పేరుతో ఓ కేసుని సృష్టించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు.
అయితే జగన్ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఆ తర్వాత జరిగినదంతా అందరికీ తెలుసు కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు.
అయితే ఆరోజు జగన్మోహన్ రెడ్డి ఏ ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసుతో చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీయాలనుకున్నారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అదే ‘స్కిల్ డెవలప్‌మెంట్’ ఫైలుపై 5వ సంతకం చేయడం విశేషం.
ఇది ఆయన నిబద్దతకు, దూరదృష్టికి నిదర్శనంగా భావించవచ్చు. నాడు, నేడూ, భవిష్యత్‌లో కూడా యువత ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడం అవసరమని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతారు. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్ ఫైలుపైనే 5వ సంతకం చేశారు.
దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే ఐటి రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గ్రహించిన చంద్రబాబు నాయుడు, హైదరాబాద్‌కి అనేక ఐటి కంపెనీలను రప్పించారు. అయితే వాటిలో ఉద్యోగాలు సాధించాలంటే వాటికి తగ్గ అర్హతలు కూడా ఉండాలని గ్రహించిన చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయించారు. ఒక్క ఐటి రంగంలోనే కాదు అన్ని రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు యువతకు సరైన శిక్షణ లేదని గ్రహించి ‘స్కిల్ డెవలప్‌మెంట్’కి బీజం వేశారు.
ఆనాడు ఆయన చాలా దూరదృష్టితో తీసుకున్న ఆ నిర్ణయాల వలన ఈ మూడు దశాబ్ధాలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది యువత ఐటి రంగంలో స్థిరపడటమే కాకుండా దానిని శాశిస్తున్నారు కూడా.
స్కిల్ డెవలప్‌మెంట్ అసెస్‌మెంట్ (నైపుణ్య గణన) ఫైలుపై సంతకం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వరకు రిమోట్ వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి వాటిలో యువతకు ఐటి రంగంతో పాటు వివిద రంగాలలో శిక్షణ ఇస్తామని చెప్పారు.
విదేశాలలో చదువుకున్న ఉన్నత విద్యావంతుడిని… యువకుడిని అని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి ‘స్కిల్ డెవలప్‌మెంట్’పై కనీస అవగాహన లేకపోవడం విచిత్రమే. అందుకే దానిని ఓ రాజకీయ ఆయుధంగానే భావించి ఓ కేసుగా మలుచుకున్నారని చెప్పవచ్చు.
యువత తన కాళ్ళపై తాము నిలబడి మరో పదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తుంటే, రాష్ట్రంలో ప్రజలందరూ ఎప్పటికీ ప్రభుత్వంపైనే ఆధారపడి వైసీపికి మాత్రమే ఓట్లు వేస్తూ జీవించాలని జగన్ కోరుకున్నారు.
చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో ఉండే తేడా ఇదే!దీనిని యావత్ ప్రపంచం గ్రహించింది కానీ జగన్ మాత్రం ఇంకా గ్రహించనే లేదు. అందుకే ఇంకా మిడిసిపడుతున్నారు. అలా మిడిసి పడితే ఏమవుతుందో కూడా తెలుసుకోవాలని జగన్ కోరుకుంటున్నట్లున్నారు. తధాస్తు!




