ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని వైసీపీ నేతలు నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. అది సర్వసాధారణమే. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు నాయుడుని విమర్శించని రోజు ఉండదు.
వారి రాష్ట్రంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ ఆదిపత్య పోరు సాగుతూనే ఉంటుంది. దానిలో కాంగ్రెస్ మంత్రులు నేరుగా బీఆర్ఎస్ పార్టీని దాని అధినేత కేసీఆర్‌ని, గతంలో అయన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ గురించి నిలదీస్తుంటారు.
కానీ కేటీఆర్, హరీష్ రావులు తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు తప్పనిసరిగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కూడా కలిపి విమర్శిస్తూనే ఉంటారు.
అయన కనుసన్నలలోనే తమ సిఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన ఆదేశం మేరకు గోదావరి నీళ్ళు నిలువచేయకుండా ఆంధ్రాకు విడిచి పెడుతున్నారని విమర్శిస్తుంటారు.
ఆ విమర్శలలో సిఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేయడాన్ని కాంగ్రెస్ మంత్రులు తప్పు పట్టరు. ఖండించరు. అలాగే కేటీఆర్, హరీష్ రావులు చంద్రబాబు నాయుడుని ఎంతగా విమర్శిస్తున్నా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టీడీపి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోరు. కనీసం స్పందించరు.
తాము ఎంతగా స్పందిస్తే అంతగా బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసినవారం అవుతామనే ఏపీ, తెలంగాణ టీడీపి నేతలు మౌనం పాటిస్తునట్లున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య కాళేశ్వరం, తదితర ప్రాజెక్టులలో సాగునీటి నిలువ చేయడం, దానిని ఎత్తిపోసుకోవడంపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగుతున్నాయి.
మాజీ మంత్రి కేటీఆర్ నేడు మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలాగే సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడుతూ, “ఆయన తన పాత గురువుగారు రుణం తీర్చుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నిలువచేయకుండా ఆంధ్రాకు విడిచి పెడుతున్నారు. ఇక్కడ ఈయన నీళ్ళు వదిలేస్తుంటే అక్కడ ఆయన పట్టిసీమలో నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు,” అంటూ సిఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేశారు.
ఏపీ, తెలంగాణ టీడీపి నేతల వ్యూహాత్మక మౌనం చివరికి కల్వకుంట్ల కవిత వంటి వారికి కూడా సిఎం చంద్రబాబు నాయుడు అంటే చాలా అలుసుగా మారిందని చెప్పక తప్పదు.
తమకు మాత్రమే సంస్కారం ఉందని భావించే ఆ అన్నా, చెల్లెలు వయసులో, అనుభవంలో, రాజకీయాలలో, పాలనలో ఏవిధంగా చూసినా తన తండ్రి కంటే పెద్దవారైన సిఎం చంద్రబాబు నాయుడు గురించి చులకనగా మాట్లాడటం తప్పుగా అనుకోవడం లేదు. అలాగే టీడీపి నేతలు కూడా? లేకుంటే స్పందించాలి కదా?




