తెలుగుదేశం ఎన్డీయే నుండి బయటకు వచ్చేయడం చంద్రబాబు నాయుడు మాటల పదును పెంచారు. “డిఫెన్స్ బడ్జెట్ అడిగేంత సంస్కార హీనుల్లా కనిపిస్తున్నామా?,” అని చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేస్తే దేశరక్షణకు ఎలా అని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్న మాటలకు చంద్రబాబు ఇలా స్పందించారు.
“మిత్ర పక్ష సభ్యులు ఉభయ సభల్లో పోరాటం చేస్తుంటే ప్రధాని ఒక గంట సమయం ఇచ్చి మాట్లాడలేరా? ఐదు కోట్ల జనాభా ఉన్న చిన్న రాష్ట్రం అనే కదా ఈ నిర్లక్ష్యం. నిన్నటి వరకు ఎదురుచూశాను. ఫైనాన్షియల్ బిల్లులోనూ ఏమీ చేయలేదు. ఇక ఎన్డీఏలో ఎందుకు ఉండాలనే బైటికి వచ్చేశాం,” అని చంద్రబాబు ఎన్డీయే నుండి బయటకు రావడానికి గల కారణాన్ని వివరించారు.
మరోవైపు తెలుగుదేశం పెడుతున్న అవిశ్వాసానికి మద్దత్తు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే తమకు మద్దత్తు ఇచ్చే ఎంపీల సంఖ్య 100 దాటిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. పదకొండు పార్టీలతో కలిపి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాట్లు తెరవెనుక చేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.



