శాసనసభ్యులకు శిక్షణ… చాలా మంచి నిర్ణయమే!

chandrababu-naidu-with-cabinet-ministers-and-tdp-leaders

సాధారణంగా పార్లమెంట్, శాసనసభ సమావేశాలలో కొంతమందే చర్చలలో పాల్గొని మాట్లాడుతుంటారు. మిగిలినవారందరూ అటెండెన్స్ వేయించుకోవడానికే వచ్చిన్నట్లు వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి.

ADVERTISEMENT

చాలా మంది ప్రజాప్రతినిధులకు చట్టసభలలో చర్చిస్తున్న అంశాలపై పూర్తి అవగాహన లేకపోవడం, మాట్లాడే నేర్పు లేకపోవడం వంటి పలు కారణాల వలన ప్రేక్షకపాత్రకు పరిమితమవుతుంటారు.

ప్రజలు నేరుగా చట్ట సభలలో మాట్లాడలేరు కనుకనే తమ ప్రతినిధులుగా వారిని ఎన్నుకుంటారు. కానీ వారు కూడా మాట్లాడలేకపోతే? ఏదో కుంటిసాకుతో సమావేశాలకు హాజరుకాకపోతే వారిని ఎన్నుకొని ఏం ప్రయోజనం?

ఇంతకీ విషయం ఏమిటంటే ఈసారి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌తో సహా తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టినవారు 84 మంది, రెండోసారి ఎన్నికై వచ్చినవారు 39 మంది ఉన్నారు.

వీరందరికీ శాసనసభలో నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌, కేటాయింపులు, నిధులు తదితర అంశాల గురించి ఒకరోజు (మంగళవారం) శిక్షణ ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచనతో స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు.

ఎమ్మెల్యేలందరూ ఈ అంశాలపై అవగాహన ఏర్పరచుకొని సభలో మాట్లాడాలని, బడ్జెట్‌పై తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని స్పీకర్‌ సూచించారు. అప్పుడే శాసనసభలో అర్ధవంతమైన చర్చలు జరిగి చక్కటి నిర్ణయాలు తీసుకోగలమని అన్నారు.

గత 5 ఏళ్ళలో శాసనసభ సమావేశాలంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబ సభ్యులను అవహేళన చేయడం, జగన్‌ భజన చేయడమే అన్నట్లు సాగాయి. జగన్‌ మంత్రులలో ఒకరిద్దరికి తప్ప మిగిలినవారికి తమ శాఖలపై ఎటువంటి అవగాహన ఉండేది కాదు.

వైసీపి ఎమ్మెల్యేలు సరేసరి. కనుక వారందరూ సులువుగా, తడబడకుండా మాట్లాడగలిగే ఈ ఒక్క ‘సబ్జెక్ట్’ పోటాపోటీగా మాట్లాడేవారు. ఆ సమావేశాలు కూడా ఏదో మొక్కుబడి 4-5 రోజులే సాగేవి. అటువంటి సమావేశాలు అంతకు మించి నిర్వహించినా ప్రజాధనం వృధాకావడం తప్ప మరే ప్రయోజనం ఉండదు కూడా.

కానీ అందుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టిన మంత్రులు పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్, తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన నిమ్మల రామానాయుడు వంటివారు సైతం తమ శాఖల గురించి సాధికారికంగా మాట్లాడుతుండటం అందరూ గమనించే ఉంటారు.

ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలకు కూడా శాసనసభ వ్యవహారాల పట్ల శిక్షణ ఇస్తుండటం చాలా మంచి నిర్ణయం. ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే చక్కటి పాలన, ప్రభుత్వాన్ని అందిస్తాయని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories