బనకచర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, అది చేస్తున్న ఈ నీళ్ళ రాజకీయాలతో నష్టపోతామనే భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా రాజకీయాలు చేస్తున్నాయో ఏపీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు.
ఈరోజు విజయవాడ, మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సిఎం చంద్రబాబు నాయుడు నీళ్ళ రాజకీయాలు చేస్తున్న తెలంగాణ నేతలకు సూటిగా ఓ ప్రశ్న వేశారు.
“తెలంగాణలో వరదలు వస్తే ఆ నీటిని దిగువనున్న ఆంధ్రప్రదేశ్ మీదకి విడిచి పెడుతుంటారు. ఆ వరద కష్ట నష్టాలను మేమే భరించాల్సి వస్తోంది. కానీ ఆ వరద నీటిని మేము బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు తరలించి వాడుకుంటామంటే అభ్యంతరం చెపుతున్నారు.
ఏటా ఈ వరదల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూనే ఉంది. ఆ నష్టం మేము భరించాలి కానీ ఆ వరద నీటిని వాడుకోవడానికి వీల్లేదా?ఇదెక్కడి న్యాయం?
సముద్రంలో వృధాగా కలుస్తున్న వరద నీటిని మేము రాయలసీమకు తరలించుకుంటే మీకు వచ్చే నష్టం ఏమిటి? మీకెందుకు అభ్యంతరం?” అని సిఎం చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు నీళ్ళ దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ మైలేజ్ పొందాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అయన అడిగిన ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలరా?
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ నీళ్ళ రాజకీయాల గురించి ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం ఉండదు. తెలంగాణ ప్రజలకు అక్కడి టీడీపి ద్వారానే అర్ధమయ్యేలా వివరించగలిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు గమనించాల్సిన ఓ ముఖ్య విషయం ఒకటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నీళ్ళ రాజకీయాలను, తెలంగాణ సెంటిమెంట్‌ని వేరు చేయలేనంత వరకు ఆ పార్టీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని పదేపదే వేలెత్తి చూపిస్తూ బురద జల్లుతూనే ఉంటుంది. ఆ కారణంగా తెలంగాణ ప్రజలలో ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నీళ్ళ బంధాన్ని ఏవిదంగా బ్రేక్ చేయాలో సిఎం చంద్రబాబు నాయుడే ఆలోచించాలి.






