తెలుగుదేశం పార్టీ మళ్ళీ బిజెపితో జతకట్టి ఎన్డీయేలో చేరబోతోందని ఓ జాతీయ మీడియాలో వచ్చిన వార్తపై టిడిపి కంటే వైసీపీ మంత్రులు వారి ఆత్మసాక్షి మీడియాయే ఎక్కువగా స్పందిస్తోంది. అది దానిలో అభద్రతాభావాన్ని సూచిస్తున్నట్లు భావించవచ్చు.
వీటిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “అప్పుడూ, ఎప్పుడూ మేము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయాలు తీసుకొన్నాము. ఆ కోణంలో నుంచే కేంద్ర రాజకీయాలను చూశాము. కనుక ఈ వార్తను ప్రచారంలోకి తెచ్చినవారే దానికి సమాధానం చెపితే బాగుంటుంది.
గతంలో పరిపాలన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి పార్టీపై పెట్టకపోవడం వలన చాలా నష్టపోయాము. విభజన వలన తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకొని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా నిలపాలనే తాపత్రయంలో వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలా నష్టపోయాము. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ధృడమైన సంకల్పంతో ముందుకు సాగుతుండటం వలన వెనక పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించడంలో ఆలస్యమైంది.
ఓ వైపు రాష్ట్ర విభజన గాయాలు, మరో పక్క ఆర్ధిక పరిమితుల మద్యనే రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలుచేశాము. ఆ తర్వాత రాజకీయంగా టిడిపి నష్టపోయినప్పటికీ మా శక్తి మేర రాష్ట్రాభివృద్ధికి కృషి చేశామనే సంతృప్తి కలిగింది. అది చాలు.
విభజన వలన కలిగిన నష్టం కంటే ఈ మూడేళ్ళలో జగన్ పాలనలో జరుగుతున్న విధ్వంసం వలన కలిగిన నష్టమే చాలా ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేస్తున్నారు. అవి పూర్తిగా నాశనమైతే వాటిని మళ్ళీ గాడిన పెట్టుకోవడానికే చాలా సమయం పడుతుంది.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో తొలిసారిగా తామే సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటోంది. కానీ ఆనాడు ఎన్టీఆర్ హయాం నుంచే సంక్షేమ పధకాలను అమలుచేసిన సంగతి అందరికీ తెలుసు. మేము మళ్ళీ అధికారంలోకి రాగాఏ ముందుగా చిన్నాభిన్నమైన వ్యవస్థలన్నిటినీ గాడినపెట్టి, ఇంతకంటే మంచి సంక్షేమ పధకాలే అమలుచేస్తాము,” అని అన్నారు.



