ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లకు చాలా లోకువ. ఆయనని ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడుతుంటారు. అంతేకాదు… పార్టీ శ్రేణులకు, ఇంకా చాలా మందిలో ఈ విష బీజాలే నాటారు. అటువంటివారు ఈ విద్వేష భావజాలాన్ని నరనరాన్న జీర్ణించుకున్నారు. కనుక వారు కూడా ఏపీని, సిఎం చంద్రబాబు నాయుడుని అకారణంగా ద్వేషిస్తుంటారు.
అయితే కేసీఆర్-చంద్రబాబు, వారిద్దరి వారసుల రాజకీయాలను, వారి పార్టీల పరిస్థితిని ఓసారి బేరీజు వేసి చూసుకుంటే కేసీఆర్ రాజకీయ ఫార్ముల ఫెయిల్ అయ్యిందని వారు కూడా అంగీకరిస్తారు. కళ్ళెదుట కనిపిస్తున్న నిదర్శనాలు ఇవిగో..
కేసీఆర్ రాజకీయ ఫార్ముల:
1. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిఉండగా కేసీఆర్ ఆయనకు ఆ అవకాశం లేకుండా చేశారు. కేసీఆర్‌ని ఓడగొట్టి ఫామ్‌హౌసులో కూర్చోబెడతానని చెప్పి మరీ ఓడించిన రేవంత్ రెడ్డి, ఇప్పడు మరో పదేళ్ళు నేనే సిఎం అంటున్నారు! మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
2. కేసీఆర్ ఫామ్‌హౌసులో కూర్చొని పార్టీని కొడుకు కేటీఆర్ చేతికి అప్పగిస్తే ప్రతీ ఎన్నికలలో పార్టీ ఓడిపోతూనే ఉంది.
3. మోడీపై కేసీఆర్ కత్తులు దూసినందున కూతురు కవిత జైలుకి వెళ్ళాల్సివచ్చింది.
4. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించి ఆమె రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా చేశారు.
5. అందుకు ఆమె మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకున్నారు. త్వరలో సొంత పార్టీ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నిలువునా చీల్చబోతున్నారు.
6. కేసీఆర్ అహంభావంతో విర్రవీగినందునే దేశ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు.
7. చివరికి అదే బిజేపి సాయంతో కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు నాయుడు రాజకీయ ఫార్ముల:
1. రాజకీయాలలో భేషజాలు పక్కన పెట్టి, ఒక మెట్టు దిగడానికి మొహమాటపడరు. అందువల్లే బిజేపితో మళ్ళీ పొత్తులు కుదుర్చుకున్నారు.
2. కేసీఆర్, జగన్ తమ ఆహానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కనుక వారు ఎవరితో ఎక్కువ కాలం సఖ్యతగా ఉండలేరు. కనుకనే రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు. ఆ ఒంటరితనాన్నే వారు తెలివిగా ‘సింగిల్ సింహాలు’గా బ్రాండింగ్ చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అడవిలో సింహాలు కూడా సింగిల్‌గా ఉండవు. కలిసికట్టుగానే జీవిస్తాయి. వేటాడుతాయి.
3. చంద్రబాబు నాయుడు అందరితో కలిసిపోతూ, అందరినీ కలుపుకుపోతూ తాను రాణిస్తున్నారు. తనతో కలిసి పని చేసినవారికీ కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు, గౌరవం కల్పిస్తున్నారు.
4. కేసీఆర్ మోడీతో కత్తులు దూసి తెలంగాణకు నష్టం కలిగిస్తే, సిఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసుకుంటున్నారు.
5. చంద్రబాబు నాయుడు తన రాజకీయ వారసుడు నారా లోకేష్‌కి మాట తీరు, నడవడిక, హుందాతనం, సీనియర్లను గౌరవించడం, సామాన్య ప్రజల పట్ల వినయంగా, ఆప్యాయంగా మాట్లాడటం వంటివి నేర్పించారు. అలాగే దేశ ప్రధాని, కేంద్రమంత్రుల పట్ల కూడా వినయంగా ఉంటూనే తన తెలివితేటలు, సామర్ధ్యాన్ని వారు గుర్తించేలా చేశారు. ఇలా పలు విషయాలలో చంద్రబాబు నాయుడు ఓ మంచి తండ్రిగా కొడుకుకి చక్కటి మార్గదర్శనం చేశారు. అందుకే మంత్రి నారా లోకేష్ ఇంతగా రాణిస్తున్నారు.
6. కానీ కేసీఆర్ కేసీఆర్ తన సొంత కొడుకు, కూతురుకి కూడా న్యాయం చేయకపోగా వారసత్వంగా తన అహంభావాన్ని అలవాటు చేసి వారి భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మార్చేశారు.
7. కేసీఆర్ అహంభావం, కయ్యలమారి గుణం వల్లనే తెలంగాణ నష్టపోగా, చంద్రబాబు నాయుడు కలుపుగోరుతనం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.
8. అయితే 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి, అపర చాణక్యుడు కేసీఆర్‌కి ఇవన్నీ తెలియవనుకోలేము. కానీ తెలిసి ఉన్నా తప్పులు సరిదిద్దుకునేందుకు, ఎదుటవాళ్ళ నుంచి నేర్చుకునేందుకు కూడా ఆయన అహం అడ్డొస్తోంది. అహం వీడితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా చరిత్రలో నిలిచిపోతారు. అహమే ముఖ్యమనుకుంటే దాంతోనే సర్వం కోల్పోతారు.




