డోనాల్డ్ ట్రంప్‌కి తన దేశం, ప్రజలు అంటే ఎంతైనా అభిమానం ఉండొచ్చు. కానీ అందుకోసం ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించాలని కోరుకోవడమే తప్పు. తన నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు, సంస్థలు, ప్రజలు కూడా నష్టపోతున్నారని తెలిసి వెనక్కు తగ్గితే గౌరవంగానే ఉంటుంది. కానీ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు.
‘కర్రున్నవాడిదే బర్రె’ అని అందరూ భావిస్తున్నందున ట్రంప్ నిర్ణయాలను ఆక్షేపిస్తున్నారు కానీ ఎవరూ అందుకు ప్రతీకార చర్యలు చేపట్టడానికి సాహసించడం లేదు. అది మంచిది కాదు కూడా.
కానీ ఒక్క చైనా మాత్రం అమెరికా దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించగలిగింది. అందుకు ట్రంప్ కూడా చైనా దిగుమతులపై నూరు శాతం సుంకాలు పెంచుతామని ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలని పునః సమీక్షిస్తామంటూ ఘాటుగానే స్పందించారు.
ప్రపంచంలో అన్ని దేశాల కంటే విదేశాలకు ఎక్కువ ఉత్పత్తులు, సేవలు ఎగుమతి చేస్తున్న చైనా ఇంత ధైర్యంగా అమెరికాపై ప్రతీకార సుంకాలు ఎలా విధించగలిగింది?అంటే అన్ని రంగాలలో స్వయంప్రతిపత్తి సాధించడం వలననే అని భావించవచ్చు.
కనుక భారత్ కూడా ఆ స్థాయికి ఎదిగినప్పుడు అమెరికా కొరడా దెబ్బలను భరించాల్సిన అవసరం ఇక ఉండదు.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధతలు చేపట్టిన తర్వాత ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా ‘మేకిన్ ఇండియా’ పేరుతో దేశంలో మళ్ళీ పరిశ్రమల స్థాపనని ప్రోత్సాహిస్తున్నారు. దాంతో స్టార్టప్ కంపెనీలు మొదలు అనేక దిగ్గజ దేశ విదేశీ కంపెనీలు ఏర్పాటవుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
భారత్ కూడా స్వయంప్రతిపత్తి సాధించే దిశలో అడుగులు వేస్తున్నందునే ట్రంప్ దెబ్బ నుంచి ఒక్క రోజులోనే భారతీయ షేర్ మార్కెట్ మళ్ళీ పుంజుకోగలిగిందని చెప్పవచ్చు.
ఏది ఏమైనప్పటికీ చైనా స్థాయికి ఎదిగి అమెరికాని ఢీకొనడానికి భారత్‌కి ఇంకా చాలా ఏళ్ళు పట్టవచ్చు. కనుక అంతవరకు ట్రంప్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటివారి తలతిక్క నిర్ణయాలకు మూల్యం చెల్లించక తప్పదు.
ఇక అమెరికా-చైనా మద్య మొదలైన ఈ వాణిజ్య యుద్ధం విషయానికి వస్తే, ఇది ఇంకా ఎంతకాలం సాగుతుంది? దీనిలో ఎవరు గెలుస్తారు?అంటే ఇది తాత్కాలికమే అని భావించవచ్చు. కానీ ఈ యుద్ధ ప్రభావం భారత్‌తో సహా ప్రపంచ దేశాలపై ఏవిదంగా ఉండబోతోందనేది చాలా ముఖ్యం.
ఆ రెండు దేశాల మద్య సయోధ్య కుదిరేలోగా చైనా మీద కోపంతో భారత్ వంటి మిత్ర దేశాల పట్ల ట్రంప్ కాస్త మెత్తబడే అవకాశం ఉంటుంది. భారత్ కూడా ట్రంప్‌ని చల్లబరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కనుక త్వరలోనే ఈ ట్రంప్ ఎఫెక్ట్ నుంచి భారత్ బయటపడే అవకాశం ఉంది.
కానీ ప్రతీసారి ఇలా ఎవరికో ఒకరికి తిక్కపుడితే భారత్ నష్టపోతుందని ట్రంప్ ఓ చక్కటి గుణపాఠం నేర్పారు. కనుక భారత్ కూడా అన్ని రంగాలలో స్వావలంభన సాధించడం చాలా అవసరం. ముఖ్యంగా సామాన్య, మద్యతరగతి ప్రజలు మళ్ళీ పొదుపు అలవాటు చేసుకోవడం చాలా మంచిది. లేకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని బాధ పడి ప్రయోజనం ఉండదు.




