‘జనసేన’ ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో పోటీ చేస్తామని స్పష్టం చేసారు. ఇప్పటివరకు 32 సముస్యలపై పోరాడాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చిందని, ప్రజా సమస్యలపై పోరాడాలన్న డిమాండ్ బలంగా ఉందని, దీంతో పార్టీ బలోపేతానికి ప్రణాళిక రచించుకున్నామని తెలిపారు.
జూన్ నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టనున్నామని, యూత్ లీడర్ షిప్ ను ప్రోత్సహించాలని భావిస్తున్నామని, ఇందుకోసం తాము ఒక ప్రణాళిక చేపట్టనున్నామని, ఇంతవరకు తమ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సరైన యువ నాయకత్వం పార్టీకి కావాల్సి ఉందని, 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పార్టీ నిలదొక్కుకోవాలంటే, సమర్ధవంతమైన నాయకత్వం కావాలని, ఆ నాయకత్వం కోసం తాము అన్వేషిస్తున్నామని అన్నారు.
2019 ఎన్నికల్లో పొత్తుల కోసం ఇప్పుడే ఏమీ చెప్పలేమని, క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ గల వామపక్ష పార్టీల వంటి వాటితో పొత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుందని, పార్టీ నిర్మాణం తరువాతే పొత్తుల గురించి ఆలోచిస్తామని, ఏది ఏమైనా అధికారం చేపట్టడమే రాజకీయాల అంతిమ లక్ష్యం కాకూడదని, జనసేన లక్ష్యం కూడా అది కాదని, తమ పార్టీ అంతిమ లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమని, తాము పోటీ చేసే స్థానాలలో 60 శాతం సీట్లు యువకులకే ఇస్తామని స్పష్టం చేసారు.
ఇక, తానూ ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఫ్యాన్స్ కు ఉత్సాహపరిచే వార్తా అందించిన పవన్ కళ్యాణ్, తమ పార్టీలోకి చిరంజీవి రారని ఒక స్పష్టమైన ప్రకటన చేసారు. ప్రభుత్వాలు చేపట్టే పధకాలు అట్టడుగు వర్గాలకు అందడం లేదని, వారికి సక్రమంగా అందుతున్నప్పుడు ప్రభుత్వాలు నిజమైన విజయం సాధించినట్టని అన్నారు. ధనప్రవాహం లేని రాజకీయాలు కావాలని తనకు కూడా ఉందని, అయితే అది ఎంతవరకు సాధ్యమో ప్రయత్నించి చూస్తే కానీ తెలియదని, ప్రజా ఉద్యమ కారిణి ఇరోం షర్మిళ ఓటమి తనను బాధించిందని తెలిపిన పవన్, ఈ సందర్భంగా పార్టీ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.



