‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన సమయంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ అభిమాన జన సందోహం చూసి, మెగాస్టార్ చిరంజీవికి పట్టం కట్టేస్తారని విశ్లేషణలు వచ్చాయి. అయితే చిరంజీవి అభిమాన గణాన్ని ధీటుగా ఎదుర్కొన్న నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ‘మెగాస్టార్’కున్న ‘వీక్ నెస్’ మీద చావు దెబ్బ కొట్టారు. ‘పుట్టిన ఊరుకు ఏమీ చేయలేని చిరంజీవి, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని’ అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఇందులో ‘వాస్తవం’ కూడా దాగి ఉండడంతో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.
ఈ పర్యవసానాలతో మెగాస్టార్ సామాజిక వర్గానికి అడ్డా అయిన ఉభయగోదావరి జిల్లాలలో ‘క్లీన్ స్వీప్’ చేస్తారనుకుంటే, ‘క్లీన్ బౌల్డ్’ అయ్యారు. పార్టీ సంగతి పక్కన పెడితే, తన సొంతూరులో కూడా చిరుకు ప్రజాబలం లేదన్న విషయం తేలిపోయింది. దీంతో ఎలా కాదన్న ఆత్మాభిమానం ఉన్న చిరు తల దించుకోక తప్పలేదు. ఈ ఆరోపణల్లో నిజం ఉండడంతో సొంతూరుకు కాకపోయినా… ఆ చుట్టూప్రక్కల పరిసర ప్రాంతాలలో తన మార్క్ ను చూపించాలని భావించారో ఏమో గానీ, తాజాగా ఓ పార్క్ నిమిత్తం దాదాపు 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు.
సోమవారం నాడు సదరు పార్క్ ప్రారంభోత్సవం జరిగింది. తణుకు మునిసిపాలిటీతో ఏర్పాటు చేసిన ఈ పార్క్ కు ‘డా.కే.చిరంజీవి మునిసిపల్ చిల్డ్రన్ పార్కు’ అని నామధేయం చేసారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చేతుల మీదుగా ప్రారంభమైన పార్క్ ఏర్పాటుతోనైనా, చిరంజీవిపై స్థానిక ప్రజల్లో ఉన్న భావన తొలగిపోతుందేమో చూడాలి. లేదంటే మెగాస్టార్ స్థాయికి తగ్గట్టు… ఒక్క తణుకులో ఏంటి… రాష్ట్ర వ్యాప్తంగా ‘చిరంజీవి పార్క్’లను ఏర్పాటు చేయాలంటారేమో!



