జగన్ ప్రభుత్వానికి చిరంజీవి తొలి టీజర్‌… ట్రైలర్‌ ఎప్పుడో?

Chiranjeevi On Jagan Governmentమెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాత వాటి గురించి మాట్లాడటం దాదాపు మానుకొన్నారనే చెపొచ్చు. సినిమా కార్యక్రమాలకు హాజరైనప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి అయినా చాలా ఆచితూచిమాట్లాడుతుంటారు. కానీ రాజకీయ ప్రస్తావన అసలు చేయరు. అయితే వాల్తేర్ వీరయ్య సినిమా 200 రోజులు పూర్తిచేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లో సక్సస్‌ మీట్‌ జరిగింది. దానిలో తొలిసారిగా చిరంజీవి జగన్ ప్రభుత్వ పాలనపై నిశిత విమర్శలు చేశారు.

ADVERTISEMENT

“మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అంటూ చిరంజీవి చురకలు వేశారు.

బ్రో సినిమా పెట్టుబడి, కలక్షన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు చేస్తున్న ఆరోపణలు, సినిమా హీరోల పారితోషికాల గురించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతున్న మాటలు, చివరికి సినీ పరిశ్రమ నుంచి వైసీపీ ప్రభుత్వం పంచన చేరిన పోసాని కృష్ణ మురళిలాంటి వారు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుండటంతో ఇండస్ట్రీలో అందరూ బాధపడుతూనే ఉన్నారు. కానీ నోరు విప్పి ప్రశ్నిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు.

చిరంజీవి కూడా తన సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమందిని, దాని బిజినెస్ వంటి పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రస్తావన చేయకుండా ఇంతకాలం నిలువరించుకొంటున్నారు.

అయితే ఏపీలో ఒంటరి పోరాటం చేస్తున్న తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌పై ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చాలా దారుణంగా అవమానిస్తుండటంతో చిరంజీవి తొలిసారిగా ఈవిదంగా బయటపడిన్నట్లున్నారు

చిరంజీవి తొలిసారిగా జగన్‌ ప్రభుత్వాన్ని, పాలనను చాలా సున్నితంగా విమర్శించినప్పటికీ, చురకలు బాగానే వేశారని అర్దమవుతోంది. బహుశః ఎన్నికల గంట మ్రోగిన తర్వాత చిరంజీవి మరింత స్పష్టంగా మాట్లాడుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కు ఎన్నికల సమయంలో అండగా నిలబడి చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారం చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.

చిరంజీవి చెప్పినవి వాస్తవాలే అని వైసీపీలో అందరికీ తెలుసు. కనుక సానుకూలంగా స్పందిస్తారను కోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది. అప్పుడే ఎమ్మెల్యే కొడాలి నాని ఎదురుదాడి ప్రారంభించేశారు.

మచిలీపట్నం కలెక్టర్‌ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్ళున్నారు. వాళ్ళు మేము ప్రభుత్వం ఎలా నడపాలో సలహాలు ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఊసు ప్రభుత్వానికి ఎందుకు? అని ప్రశ్నిస్తునప్పుడు ప్రభుత్వం ఊసు వారికెందుకు? సినిమాలలో కుర్ర హీరోయిన్లతో డాన్సులు, విలన్లతో ఫైట్లు చేసుకోవచ్చు కదా? ఎవరు వద్దన్నారు వాళ్ళని?” అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.

అయితే చిరంజీవి లేవనెత్తిన ఏ సమస్యకు కొడాలి సూటిగా సమాధానం చెప్పనేలేదు. ఎందుకంటే అటువంటి ప్రశ్నలకు వైసీపీలో ఎవరి వద్ద సమాధానాలు ఉండవు కనుక ఎదురుదాడి చేయడం జవాబు అనుకొంటారు. అయితే పవన్‌ కళ్యాణ్‌తో ఆడుకొంటున్నట్లు చిరంజీవితో గేమ్స్ ఆడుకొంటే తామే నష్టపోతామని గ్రహిస్తే ఇక్కడితో ఇది ముగుస్తుంది. చిరంజీవిని ‘భోళాశంకర్‌’ అనుకొని ఆడుకొంటే గేమ్ బిగిన్స్! గేమ్ ఛేంజర్‌ కూడా!

ADVERTISEMENT
Latest Stories