మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈవిపీ వరల్డ్ లో వేసిన భారీ సెట్స్ లో చిత్రంలోని ప్రధాన భాగం షూటింగ్ చేయగా, మలి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ‘జనతా గ్యారేజ్, జ్యో అచ్యుతానంద’ సినిమాల సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోబోతుందని సమాచారం.
ఇక, ఈ సినిమాకు ఫోటోగ్రఫీ అందిస్తున్న సంతోష్ శివన్… ప్రిన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ ప్రకటనలు చేసారు. మహేష్ స్టార్ పవర్ సాధారణం కాదని, సరైన కాంభినేషన్ కుదిరిందని, దాదాపుగా 20 రోజుల పాటు చెన్నైలో షూటింగ్ చేసామని, సెట్స్ లో మహేష్ ఇచ్చే ఎనర్జీ, ఎక్సైట్ మెంట్ గురించి మాటల్లో చెప్పలేమని, కమర్షియల్ సినిమాలలో కొత్త ఎత్తుకు ఈ సినిమా వెళ్తుందని తన అభిప్రాయాలను పంచుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.జే.సూర్య ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నాడు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో ప్రిన్స్ సరికొత్తగా కనిపిస్తాడని దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే అభిమానులకు హామీ ఇచ్చాడు. వచ్చే వేసవి సెలవుల సందర్భంగా సిల్వర్ స్క్రీన్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ మాత్రం అంచనాలున్నాయో తెలిసిందే.



