‘ఉమాభారతి’కి చుక్కలు చూపించిన ‘జయలలిత’ జడ్జ్!

CM Uma Bharati - John Michael D'Cunhaఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌తో పాటు స‌హ‌ నిందితురాలిగా ఉన్న‌ శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన విష‌యం తెలిసిందే. చ‌ట్టం ముందు ఎవ్వ‌రూ త‌ప్పించుకోలేర‌ని మ‌రోసారి రుజువు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పునకు ప్రాతిపదిక గ‌తంలో జిల్లా జడ్జిగా ఉన్న‌ప్పుడు జస్టిస్‌ జాన్‌ మైఖేల్‌ కున్హా చేసిన సూచ‌న‌లే.

ఈ కేసులో జయలలిత, శశికళలకు జైలు శిక్ష విధిస్తూ 2014లో కున్హా తీర్పునిచ్చారు. ఆ తీర్పును సమర్థిస్తూనే తాజాగా సుప్రీంకోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష వేసింది. గ‌త ఏడాది వ‌ర‌కు జిల్లా జ‌డ్జిగా ఉన్న జస్టిస్‌ జాన్‌ మైఖేల్‌ కున్హా ఇప్పుడు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ప‌ని చేస్తున్నారు. అప్ప‌ట్లో ఆయనిచ్చిన తీర్పులు ఇద్దరు శక్తిమంతులైన మహిళా ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లేలా చేశాయి. దీంతో వారు రాజీనామాలు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది.

ADVERTISEMENT

జయలలితకు చెందిన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న‌ కేసును సుప్రీంకోర్టు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసింది. అయితే, కేసు మెల్లిగా ముందుకు సాగింది. చివ‌ర‌కు సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఐదో జడ్జిగా జాన్‌ మైఖేల్‌ కున్హాను నియమించడంతో కేసు వేగంగా క‌ద‌ల‌డం ప్రారంభించింది. 2014 సెప్టెంబరు 27న అప్ప‌టి సీఎం జయల‌లిత‌ను కోర్టుకు రప్పించి, నాలుగేళ్ల జైలు శిక్ష‌తో పాటు వంద కోట్ల జరిమానా విధించారు.

మొద‌టి నుంచి అక్ర‌మార్కుల కేసుల‌ను వేగంగా విచార‌ణ జ‌రుపుతూ వ‌స్తోన్న జాన్‌ మైఖేల్‌ కున్హా, 2004లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఉమాభారతి చేసిన త‌ప్పుకి కూడా శిక్ష విధించారు. ఈద్గా మైదానంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జెండా ఎగురవేసిన కేసులో ఉమాభారతికి బెయిలు ఇవ్వ‌డానికి కూడా నిరాకరించారు. 1994లో హుబ్లీలోని ఈద్గా మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేసులో 2002-04 మధ్య స్థానిక కోర్టు 18 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసినప్ప‌టికీ అప్ప‌ట్లో ఉమాభార‌తి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లారు.

అయితే తాను ముఖ్య‌మంత్రి అయ్యాక ఆ కేసు త‌న‌క చిక్కులు తెచ్చిపెట్టొచ్చ‌ని భావించిన ఉమాభార‌తి ప్రభుత్వ న్యాయవాదుల సలహా మేరకు హుబ్లీ జిల్లా జడ్జిగా ఉన్న కున్హా ముందు హాజరయ్యారు. తనపై అభియోగాలను కొట్టేయాలని కోరినప్పటికీ, కున్హా నో చెప్పేశారు. రెండేళ్ల క్రితం నాటి కేసులో అభియోగాలు కొట్టేయడం కుదరదని స్పష్టం చేశారు. ఆయ‌న తీసుకున్న ఆ నిర్ణ‌యంతో ఉమాభారతి అనంత‌రం జైలుకి వెళ్లి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

ADVERTISEMENT
Latest Stories