ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్ని జిల్లాలలో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. కోస్తాలో లంక గ్రామాలు ఎప్పటిలాగే జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇళ్ళలో నీళ్ళు చేరాయి. వాటితో పాటు పాములు, తేళ్ళు కూడా రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆదుకొనే నాధుడు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొన్ని చోట్ల ప్రభుత్వాధికారులు అరకొర సాయం అందించి వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే లంక గ్రామాలలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. ఇన్ని రోజుల తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి తాపీగా నేడు వరద బాధితుల పరామర్శకు బయలుదేరి వెళ్ళారు.
ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కూనవరం, వీఆర్ పురం మండలాలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. అయితే అక్కడ కూడా మరిచిపోకుండా చంద్రబాబు నాయుడు నామస్మరణ చేయడం విశేషం. గతంలో వరదలు సంభవించినప్పుడు చంద్రబాబు నాయుడు హడావుడిగా వచ్చి ఫోటోలు దిగి వెళ్లిపోయేవారని, అధికారులతో సమీక్షా సమావేశాలంటూ హడావుడి చేసేవారని జగన్ అన్నారు.
కానీ తన ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా చాలా చురుకుగా పనిచేస్తుందని జగన్ చెప్పారు. ఏ జిల్లాలో ఎంత వరదనష్టం జరిగిందో పూర్తి వివరాలు జిల్లాల కలెక్టర్ల వద్ద ఉన్నాయని చెప్పారు. గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను యాక్టివ్ చేసి వారి ద్వారా బాధితులకు సాయం అందజేస్తున్నామని చెప్పారు.
పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులకు త్వరలోనే పునరావాస ప్యాకేజ్ అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు. సీడబ్ల్యూసీ నిబందనల ప్రకారమే పోలవరం ప్రాజెక్టులో క్రమంగా నీళ్ళు నింపుతామని జగన్ చెప్పారు. అయితే పోలవరం గురించి మంత్రి అంబటితో సహా అందరికీ తెలిసింది ఒక్కటే… డయాఫ్రామ్ వాల్వ్. అది దెబ్బ తింది కనుక ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేయగలమో చెప్పలేమని మంత్రి అంబటి రాంబాబు చెపుతుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి పూర్తికాని ఆ ప్రాజెక్టులో నీళ్ళు నింపుతానని చెపుతున్నారు!!!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా ఏళ్ళపాటు ఆయన నామస్మరణ చేస్తూ అధికారంలోకి వచ్చారు. కానీ సిఎం అయినప్ప నుంచి రాజశేఖర్ రెడ్డికి బదులు చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తుండటం విశేషం. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారి కష్టానష్టాలను అడిగి తెలుసుకొని అవసరమైన సాయం అందేలా చేయాలి. కానీ విశాఖలో వచ్చిన ‘హూద్ హూద్ తుఫాను’ సమయంలో చంద్రబాబు నాయుడు డ్రామా చేశారని జగన్ ఎద్దేవా చేశారు!
జగన్ సిఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగున్నరేళ్ళు కావస్తోంది. అయినా తన ప్రభుత్వ పనితీరును చంద్రబాబు నాయుడి ప్రభుత్వంతో పోల్చుకొంటూ మాట్లాడటం అలవాటుగా మారిపోయింది. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభావం నుంచి జగన్ బయటపడలేదాని అర్దమవుతోంది. అయినా చంద్రబాబు నాయుడు పనితీరుతో పోల్చుకొంటే నవ్వులపాలయ్యేది ఎవరు?



