అవినీతి కేసుల నుంచి కూడా రాజకీయ మైలేజ్… గ్రేట్!

Political corruption cases being used as tools for political gain in India

మన రాజకీయ వ్యవస్థలో క్రమంగా ఒక అతి పెద్ద మార్పు వచ్చింది. ఆ మార్పు గురించి ప్రజలు పూర్తిగా తెలుసుకునే లోపుగానే, వారు కూడా అదే ప్రవాహంలో కొట్టుకు పోతున్నారు. ఇది నెమ్మదిగా వ్యవస్థను… ప్రజల ఆలోచనా ధోరణిని కూడా మార్చేస్తోంది.

ఆ మార్పేమిటంటే అధికారంలో ఉన్నవారు అవినీతి, అక్రమాలకు పాల్పడితే వారిని ఎవరూ ఆపలేరు. కనీసం వారు అధికార కుర్చీ నుంచి దిగిపోయిన తర్వాత కూడా, వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితి ఉండడం లేదు.

ADVERTISEMENT

ఒకవేళ చర్యలు తీసుకుంటే, దానికి వెంటనే రాజకీయ కక్ష సాధింపు అనే ట్యాగ్ అంటించేస్తారు. ఫలితంగా అవినీతి ద్వారానే కాదు, అవినీతి కేసుల ద్వారానూ రాజకీయ మైలేజ్ సంపాదించే పరిస్థితి ఏర్పడింది.

ఉదాహరణకు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుంది.

దీనిపై కేటీఆర్‌, హరీష్ రావు స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నామనే కారణంతోనే ఈ కేసులు తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే హఠాత్తుగా నోటీసులంటున్నారు.

ఇలాంటి తప్పుడు కేసులకు భయపడమని, కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చని వారు బహిరంగంగా చెబుతున్నారు. నోటీసులు ఇవ్వకముందే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

అరెస్టులు, జైలు అనే మాటలతో ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని రాజకీయంగా మలచుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో కేసులో అడుగు ముందుకు వేయాలంటే ప్రభుత్వమే వెనుకడుగు వేసే స్థితి కనిపిస్తోంది. అవినీతి జరిగిందని తెలిసినా రాజకీయ లెక్కలతో చర్యలు తీసుకోలేకపోతే, అవినీతికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది?

ఈ విధంగా అవినీతి కేసుల నుంచే రాజకీయ లాభం లభిస్తుంటే, అధికారంలో ఉన్నవారు నిజంగా అవినీతికి దూరంగా ఉంటారా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది.

అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుంటే ప్రజలు అసలు విషయం మరిచిపోతున్నారు. అవినీతిపరులు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని గమనించకుండా, ఏదో ఒక పక్షాన నిలబడి పరస్పరం పోరాడుతున్నారు.

రెండు పార్టీల మధ్య చీలిపోయిన ప్రజలు తమలో తామే తలపడుతున్నారు. రాజకీయ నాయకులు వ్యవస్థలో తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు ఇదే.

ADVERTISEMENT
Latest Stories