భారత్ బయోటెక్ రూపొందిస్తున్న భారత దేశపు మొట్టమొదటి కరోనా వైరస్ వాక్సిన్… కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా వివిధ హాస్పిటల్స్ లో మొదలయ్యాయి. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. కోవాగ్జిన్‌ను డాక్టర్లు విజయవంతంగా ఇద్దరిపై ప్రయోగించారు.
ఆ ఇద్దరిని రెండు రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. రెండు వారాల తర్వాత రెండో డోసును ప్రయోగిస్తారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా ట్రయల్స్ మొదలయ్యాయి. 12 ప్రాంతాల్లో మొత్తం 375 మందిపై క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు సమాచారం. గతంలో ఆగస్టు 15 నాటికి ఈ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పినా అది సాధ్యపడదని అంటున్నారు.
తాజాగా డిసెంబర్ నాటికి ఈ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ వర్గాలు చెబుతున్నాయి. ఆక్సఫర్డ్ యూనివర్సిటీలో తయారవుతున్న కరోనా వాక్సిన్ అక్టోబర్ నాటికే అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. అయితే దేశీయంగా తయారయ్యే వాక్సిన్ మనకు మరింత అందుబాటులో ఉండి… ధరకు సరసంగా ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం.
ఇది ఇలా ఉండగా.. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నలభై వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దానితో మొత్తం కేసులు 11,18,043కు చేరుకున్నాయి. ఇప్పటివరకూ ఈ వైరస్ కారణంగా 27,497 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కసారిగా కేసులు పెరగడం కలవరపెడుతుంది.



