ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని వార్తలు వస్తున్నాయి. అధికార వైసీపీ చేస్తున్న హడావుడి కూడా అదే సంకేతాలు ఇస్తోంది. కనుక రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ప్రజల మద్యకు దూసుకువచ్చేశాయి.
ఓ వైపు టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో దూసుకుపోతుంటే, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ జిల్లా పర్యటనలు చేస్తూ సాగునీటి రంగాన్ని కూడా జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించేసిందంటూ ఎండగడుతున్నారు.
మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి మంగళగిరికి మకాం మార్చేసి, చేస్తున్న సినిమాలను పక్కన పెట్టి మరీ రాష్ట్రంలో వారాహి యాత్రలు చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. బిజెపి అధిష్టానం కూడా దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా నియమించడంతో ఆమె కూడా గణాంకాలతో సహా లెక్కలు చెపుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఈవిదంగా జగన్ ప్రభుత్వాన్ని నలువైపుల నుంచి ప్రతిపక్షాలు కమ్ముకొంటుంటే, ఇప్పుడు సీపీఐ పార్టీ కూడా రంగంలోకి దిగబోతోంది. ‘రాష్ట్రాన్ని రక్షించండి… దేశాన్ని కాపాడండి’ అనే పేరుతో ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 8వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో బస్సుయాత్ర చేపట్టబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తాడేపల్లిలో ఉన్నా… విశాఖలో ఉన్నా… చివరికి సముద్రంలో షిప్పులో కూర్చొన్నా ఒక్కటే… ఆయన వలన రాష్ట్రానికి నష్టమే తప్ప ఏమీ ప్రయోజనం లేదు,” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టిడిపి, జనసేన, బిజెపిలని ఒకదానితో మరొకదానికి ముడిపెడుతూ వాటి విమర్శలని, ఆరోపణలను వైసీపీ నేతలు తేలికగా కొట్టిపడేస్తున్నారు. కానీ వాటిలో ఏ పార్టీతోను సంబందం లేని సీపీఐ విమర్శలకు ఏమని సమాధానం చెపుతారో?
తెలంగాణ సిఎం కేసీఆర్, వైఎస్ షర్మిల ఇద్దరూ ఇంకా ఏపీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వారు కూడా వస్తే ఇక రాష్ట్ర రాజకీయాలలో రచ్చరచ్చే అవుతుంది.



