బీజేపీ మనకెందుకు… మాతో రండి దింపేద్దాం!

CPI Ramakrishnaఏపీలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు. ప్రజాధరణ కూడా లేదు. ప్రత్యేకహోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తదితర అంశాలపై కేంద్రం వైఖరిపై ఆంధ్రా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో బీజేపీకి బలం లేకపోయినప్పటికీ, ఏపీలో మూడు ప్రధాన పార్టీలను కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకొని శాశిస్తుండటంతో ఆంధ్రా ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు.

కేసుల నుంచి విముక్తి కోసం జగన్‌, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుందనే ఆశతో పవన్, దౌర్జన్యపూరితంగా వ్యవహరించే వైసీపిని ఎదుర్కోవాలంటే కేంద్రం అండదండలు అవసరమని చంద్రబాబు… ముగ్గురూ మూడు వేర్వేరు కారణాలతో మోడీ, అమిత్ షాల చుట్టూ తిరుగుతున్నారు.

ADVERTISEMENT

అయితే బీజేపీని నమ్ముకోవడం కంటే దానిని విడిచిపెట్టి వస్తే కలిసి పనిచేద్దామని, అక్కడ మోడీని, ఇక్కడ జగన్‌ను గద్దె దింపుదామని సిపిఐ రామకృష్ణ టిడిపి, జనసేనలకు బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు.

“మోడీ, జగన్‌ ఇద్దరూ కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. కనుక వారిని గద్దె దించేందుకు కలిసివచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళతాము. ఏపీలో వైసీపి అరాచకాలకు, రాజకీయ ప్రతీకారాలకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరాకాష్ట. ఒకప్పుడు ఐ‌టి అంటే ఏపీ అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఏపీలో ఐ‌టి అనే పేరే వినపడకుండా జగన్‌ చేశారు.

రాష్ట్రం నుంచి పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలిపోతుంటే కనీసం సిగ్గుపడటం లేదు. పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, ఉపాధి, అమరావతి, పోలవరం గురించి జగన్‌ ఎన్నడైనా మాట్లాడటం ఎవరైనా విన్నారా? జగన్‌తో సహా మంత్రులందరూ ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను ద్వేషిస్తూ మాట్లాడటమే తప్ప రాష్ట్రాభివృధ్ది గురించి ఒక్కరూ మాట్లాడరు. అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్‌ రాష్ట్రాన్ని రివర్స్ గేరులో వెనక్కు నడిపిస్తున్నారు. అన్ని రంగాలలో రాష్ట్రం వెనకబడిపోయింది. అయినా ఇక్కడ జగన్‌కు కానీ అక్కడ మోడీకి గానీ ఏమాత్రం చింతలేదు.

మోడీ, అమిత్ షాలను అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారనుకోలేము. కనుక ముగ్గురూ కలిసే చంద్రబాబు నాయుడుని జైలుకి పంపారని నమ్ముతున్నాము. చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించినా, నారా లోకేశ్‌ని పంపించేందుకు సిద్దంగా ఉన్నా ఇంకా టిడిపి, జనసేనలు బీజేపీ పొత్తుల కోసం ఆరాటం దేనికి?

బిజేపీ చెయ్యి విడిచిపెట్టి వస్తే మేము వాటితో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాము. టిడిపి, జనసేనలు మాతో కలిస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న మోడీ, అమిత్ షా,జగన్‌ ముగ్గురినీ గద్దె దించుదాము. ఒకవేళ టిడిపి లేదా జనసేనలు బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే అప్పుడు జగన్మోహన్‌ రెడ్డి నెత్తిన పాలు పోసిన్నట్లే అవుతుందని గ్రహిస్తే మంచిది. కనుక టిడిపి, జనసేనలు బీజేపీని వదిలించుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని సిపిఐ రామకృష్ణ అన్నారు.

ADVERTISEMENT
Latest Stories