చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు… మరో తప్పటడుగే

Nara-Chandrababu-Naidu-TDP-Manifestoటిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో అంగళ్ళులో చంద్రబాబు నాయుడు ఇటీవల పర్యటించినప్పుడు వైసీపీ కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారికీ, టిడిపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరిగాయి.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడే పార్టీ కార్యకర్తలను వారిపైకి ఉసిగొల్పి అల్లర్లు జరిగేలా చేశారనేది వైసీపీ నేతల, పోలీసుల ఆరోపణ. కనుక కురబలకోట మండలం ముడివీడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమ, అమర్నాథ్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి, దమ్మలపాటి రమేష్, గంటా నరహరి,, శ్రీరామ్ చినబాబు, పులవర్తి నానితో సహా 20 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

చంద్రబాబు నాయుడుతో సహా వీరందరిపై హత్యయత్నం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఈ అల్లర్లకు మూలకారకుడు చంద్రబాబు నాయుడే అని పేర్కొంటూ ఆయనను ఏ-1గా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అదే నియోజకవర్గంలో ములకల చెరువులోను చాంద్ బాషా అనే వైసీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రబాబు నాయుడు తదితరులపై కేసు నమోదు చేశారు. దానిలో చంద్రబాబు నాయుడుని ఏ-7గా పేర్కొన్నారు.

న్యాయ రాజధాని పేరుతో టిడిపి, జనసేనలను రాయలసీమలో అడుగుపెట్టనీయకుండా చేయాలని వైసీపీ అనుకొంది. కానీ ఆ ప్రతిపాదనకు ప్రజల నుంచి మద్దతు లభించకపోగా వారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు జేజేలు పలుకుతుండటంతో వైసీపీ పెద్దలకు అసహనం కలగడం సహజమే. బహుశః ఆ అసహనమే ఈవిదంగా పోలీస్ కేసుల రూపంలో బయటపెట్టుకొందని భావించవచ్చు.

అయితే గత నాలుగేళ్ళుగా టిడిపి నేతలపై వైసీపీ ప్రభుత్వం అనేక వందల కేసులు నమోదు చేయిస్తూనే ఉంది. కానీ వాటితో ఏం సాధించింది? అంటే ఏమీ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి విజయం సాధించి వైసీపీకే షాక్ ఇచ్చింది. వైసీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలు చేజార్చుకోవడమే కాకుండా ఆ దెబ్బకి నలుగురు ఎమ్మెల్యేలను కూడా చేజేతులా టిడిపికి అప్పగించవలసి వచ్చింది కూడా!

వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్:1 తెచ్చి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లని ప్రజల మద్యకు వెళ్ళనీయకుండా అడ్డుకోవాలని చూస్తే అదీ ఫలించలేదు. పైగా ప్రభుత్వమే అభాసుపాలైంది. అంటే జీవోలతో, పోలీస్ కేసులతో టిడిపి, జనసేనలని అడ్డుకోలేదని, అటువంటి ప్రయత్నాలు చేసిన ప్రతీసారి వైసీపీయే నష్టపోతుందని అర్దమవుతోంది.

నారా లోకేష్‌పై కూడా దాదాపు 40కి పైగా పోలీస్ కేసులు నమోదు చేయించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై కూడా మరోసారి పోలీస్ కేసులు నమోదు చేయించింది. వీటితో రాష్ట్ర ప్రజలలో వారిపట్ల విముఖత ఏర్పడుతుందని వైసీపీ భావిస్తున్నట్లుంది కానీ వీటితోనే ప్రజలకు ఆయన పట్ల సానుభూతి కూడా ఏర్పడుతుందని, అదే జరిగితే ఎన్నికలలో టిడిపి లబ్ధి పొందుతుందని వైసీపీ గ్రహించిన్నట్లు లేదు.

ADVERTISEMENT
Latest Stories