144 సెక్షన్ అమలు చేసినపుడో లేక రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుని పరిస్థితి అదుపు తప్పితేనో దర్శనమిచ్చే సీఆర్ఫీఎఫ్ బలగాలు నేడు ఏపీలోని “భీమ్లా నాయక్” ధియేటర్ల వద్ద దర్శనమిస్తుండడం విశేషం. తమ చేతిలో అధికారాన్ని ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటోంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా దీనిని పేర్కొనవచ్చు.
“పేద వాడికి వినోదాన్ని తక్కువ ధరకే అందించడమే లక్ష్యం”గా పని చేస్తున్నామని చెప్తూ ఇలాంటి పనులను ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. అయితే ఇదే ప్రభుత్వం మార్చి నెల మొదటి వారంలో టికెట్ ధరలపై కొత్త జీవోను ఇవ్వనున్న విషయం తెలిసిందే. మరి ఈ వారం రోజుల వ్యవధిలో ఏం సాధించడానికి పోలీస్, రెవిన్యూ, సీఆర్ఫీఎఫ్ బలగాలను రంగంలోకి దించడం?
ఈ సందర్భంగా స్పష్టమవుతోన్న విషయం ఏమిటంటే… ‘జనసేన’ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలను అణచి వేయడానికే అన్న ఓ టాక్ హల్చల్ చేస్తుండగా, ఈ తాజా పరిణామాలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయినా తనకంటూ 151 ఎమ్మెల్యే సీట్లతో అత్యంత పదిలంగా ఉన్నప్పటికీ, ఒక్క సీటు కూడా లేనటువంటి పవన్ ను చూసి ఇంతగా స్పందించడం అవసరమా? అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.
ప్రత్యర్థి రాజకీయ నాయకుల ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టి ఎదగనివ్వకుండా చేయడమే గత మూడేళ్ళుగా జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తోన్న విధానంగా రాజకీయ విశ్లేషకులతో పాటు వివిధ సందర్భాలలో ప్రతిపక్ష నేతలు కూడా ప్రస్తావించారు. ప్రముఖ తెలుగుదేశం నేతలపైన కూడా ఇదే రకమైన తీరును అవలంభించగా, ఒక సెలబ్రిటీగా, సినీ హీరోగా ఉన్న పవన్ పై తీసుకుంటున్న చర్యలు బహిరంగం కావడంతో, ఇది హాట్ టాపిక్ గా మారిపోయిందని అంటున్నారు.
నిజానికి గత ఎన్నికలలో పవన్ కు 151 సీట్లు కావడానికి కారణం కూడా ఓ రకంగా పవన్ కల్యాణే. టీడీపీ నుండి ఓటింగ్ చీల్చడం అనేది పరోక్షంగా వైసీపీకి బలమయ్యింది. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలలో దాదాపుగా 100కి పైగా నియోజక వర్గాలలో రెండవ స్థానంలో ఉన్న టీడీపీ, మూడవ స్థానంలో ఉన్న జనసేన ఓట్లు కలిపితే మొదటి స్థానంలో ఉన్న వైసీపీని దాటుతున్నాయి. దీంతో వీరిద్దరి నడుమ చీలిక ప్రత్యక్షంగా వైసీపీకి సహకరించినట్లయ్యింది.
అలాంటి పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా సహకరించి తెలుగుదేశం పార్టీకి మరింత దూరం చేయాల్సింది పోయి, పవన్ తో విభేదాలు పెంచుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ విజ్ఞులకు కూడా అర్ధం కాని పరిస్థితి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జనసేన ఇంకా బలపడలేదు. మొత్తమ్మీద 10 శాతం ఓటింగ్ ను అయితే సాధించగలుగుతుంది గానీ, సీట్ల పరంగా ఆ సంఖ్య ఎంత ఉంటుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే.
రాజకీయ లబ్ది కోసం ఒక కన్ను కోసం మరో కన్నును సొంతంగానే పొడుచుకునే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఒక సినిమా కోసం సీఆర్ఫీఎఫ్ బలగాలను రంగంలోకి దించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అధికారం అనే ఆయుధాన్ని ఏ విధంగా వాడుకోవాలో, దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో జగన్ ప్రభుత్వం నూటికి నూరు శాతం విజయవంతం అవుతోంది.