వైసీపీ కార్యకర్తలకు జీవనోపాధి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను సృష్టించిందనేది బహిరంగ రహస్యం. వారికి నెలకు రూ.5,000 గౌరవ వేతనంతో పాటు సాక్షి న్యూస్ పేపర్ కొనుకొనేందుకు నెలకు మరో రూ.200 కూడా ఇస్తోందిప్పుడు. అందరికీ స్మార్ట్ ఫోన్స్, కార్మికులకు ఇచ్చిన్నట్లు ఏటా నగదు పురస్కారాలు పేరుతో బోనస్ వగైరాలు కూడా ఇస్తోంది. వాలంటీర్లు వైసీపీకి, ప్రభుత్వానికి కళ్ళు, చెవుల వంటివారని వారు ప్రజల నుంచి సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందిస్తుండాలని ఓ మంత్రి చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న ఈ వాలంటీర్ వ్యవస్తే దాని కొంపముంచుతుండటం విశేషం. ఇటీవల ఓ మాజీ మంత్రి గడప గడపకు కార్యక్రమంలో ఓ ఇంటికి వెళ్ళి “అమ్మా… మీకు అన్ని సంక్షేమ పధకాలు అందుతున్నాయా?” అని ప్రశ్నిస్తే “ఆ.. అందుతున్నాయి వాలంటీర్ ఇస్తున్నాడు,” అని సమాధానం చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. సంక్షేమ పధకాలతో వైసీపీ ప్రభుత్వం క్రెడిట్ పొందాలనుకోగా అది వాలంటీర్లకు దక్కుతోంది.
వాలంటీర్లు నిత్యం ప్రజల మద్యనే ఉంటూ వారికి నెలనెలా పింఛన్లు వగైరా చెల్లిస్తుంటారు కనుక ప్రజల దృష్టిలో వారే హీరోలవుతున్నారు. వారినే ప్రజలు గౌరవిస్తున్నారు. వాలంటీర్లు ప్రజలతో అల్లుకుపోవడంతో మిగిలిన వైసీపీ కార్యకర్తలకు ప్రజలలో గుర్తింపు, పట్టు తగ్గుతున్నట్లు గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలు గుర్తించారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో దూరదృష్టితో వాలంటీర్ వ్యవస్థను సృష్టించి, పోషిస్తుంటే దాంతో ఇటువంటి ఊహించని చిక్కులు ఏర్పడుతున్నాయి.
నిన్న కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కరప మండలం నడకుదురులో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా దానిలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఆయన ఈ సమస్యపై మాట్లాడుతూ, “వైసీపీకి కార్యకర్తలే ముఖ్యం తప్ప వాలంటీర్లు కారు. వారు మన ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారదిలా పనిచేస్తారని పెట్టుకొన్నామే తప్ప మనపై పెత్తనం చేయడానికి కాదు. కొన్నిచోట్ల మన కార్యకర్తలపై వాలంటీర్ల పెత్తనం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ప్రజలు కూడా మన నేతలు, కార్యకర్తల కంటే వాలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తునట్లు నా దృష్టికి వచ్చింది. వాలంటీర్ల రాకతో మనవాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు నాకు తెలిసింది. వాలంటీర్లను మనమే పెట్టుకొన్నాము కనుక వారు మన చేతి కిందే పనిచేయాలి. కనుక పార్టీ నేతలకు, కార్యకర్తలకు నచ్చకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా వారిని తక్షణం ఉద్యోగంలో నుంచి పీకేయండి. వాలంటీర్లనే కాదు…గ్రామ కార్యదర్శులను కూడా మన అదుపులో ఉంచుకోవాలి,” అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.



