బీజేపీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో బలపడగలిగింది కానీ ఏపీలో బలపడలేకపోయింది. ఏపీలో మత రాజకీయాలకు ఆస్కారం తక్కువగా ఉండటం, పార్టీలు, ఎన్నికలపై కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం, విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఏపీ బీజేపీ నేతలకు రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ప్రణాళికలు రచించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే శ్రద్ద లేకపోవడం వంటి అనేక కారణాలున్నాయి.
ఢిల్లీలోని బీజేపీ పెద్దలు రాష్ట్రంలో వైసీపి, టిడిపి, జనసేన మూడు పార్టీలను శాసిస్తూనే, వాటితో స్నేహం చేస్తున్నారు కూడా. కేసీఆర్ మొదటిసారి తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు బీజేపీ అధిష్టానం ఈవిదంగా వ్యవహరించడం వలననే తెలంగాణలో బీజేపీ బలపడలేకపోయింది.
కానీ ఎప్పుడైతే కేసీఆర్ మోడీపై కత్తులు దూయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ బలపడింది. కానీ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కేంద్రం మళ్ళీ కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరించడంతో తెలంగాణ బీజేపీ తీవ్రంగా నష్టపోయింది.
ఏపీ విషయంలో కూడా బీజేపీ పెద్దలు ఇదేవిదంగా వ్యవహరిస్తుండటంతో ఏపీ బీజేపీ అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఈసారి టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తుకి సిద్దపడుతుందని అందరూ భావించారు. కానీ బహుశః వాటి అభ్యర్ధన మేరకే ఈసారి బీజేపీ ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఒంటరి పోరాటానికి సిద్దమవుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ప్రతీ 5 నియోజకవర్గాలకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించారు కూడా. కనుక ఈసారి ఏపీ బీజేపీ ఒంటరి పోరుకి సిద్దమవుతున్నట్లు భావించవచ్చు.
ఒకవేళ ఏపీ బీజేపీ ఒంటరి పోరుకి సిద్దమైతే ఇది దానితో పాటు మూడు ప్రధాన పార్టీలకు కూడా చాలా మంచిదే.
ఈ ఎన్నికలలో బీజేపీ గెలవలేకపోయినప్పటికీ, రాష్ట్ర బీజేపీ నేతలకు తమ శక్తిసామర్ధ్యాలు ఏపాటివో స్వయంగా తెలుసుకోగలుగుతారు. చాటుకోగలుగుతారు. బీజేపీకి ఏపీలో ఎంత ఆదరణ ఉందో కూడా తెలుస్తుంది.
టిడిపి, జనసేనలకు బీజేపీ దూరంగా ఉంటే మైనార్టీ ఓటు బ్యాంకు వాటివైపు మొగ్గు చూపవచ్చు కనుక వాటి విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి.
బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. కనుక అది ఏపీలో ఒంటరి పోరుకి దిగితే ప్రధానంగా వైఎస్ షర్మిలపై యుద్ధం ప్రకటిస్తుంది. కనుక ఆమె రాకతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వైసీపికి ఉపశమనం లభిస్తుంది. బీజేపీ మతం ప్రాతిపదికన యుద్ధం ప్రారంభిస్తే దాని వలన కూడా వైసీపికి ఎంతో కొంత మేలు కలుగుతుంది.
బీజేపీ ఒంటరి పోరుకి వస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు కలుగుతుంది. అప్పుడే అది ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, అమరావతి రాజధాని, విభజన హామీల అమలు వంటి అంశాల గురించి మరింత గట్టిగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకోగలదు. కనుక ఏపీ బీజేపీ ఒంటరి పోరు రాష్ట్రంలో అన్ని పార్టీలకు మంచిదే!




