తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు బీజేపీ అధిష్టానం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను తప్పించేసి కూర్చొన్న కొమ్మనే నరుకొంది. ఇప్పుడు దాని స్థానంలోకి కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇతర పార్టీల నేతలందరూ కాంగ్రెస్‌లోకే క్యూ కడుతున్నారు తప్ప బీజేపీ వైపు చూడటం లేదంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. దీనికి తోడు బిఆర్ఎస్, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉందని అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడానికి కేంద్రం వెనకాడుతోందనే కాంగ్రెస్ వాదనలను ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈవిదంగా తెలంగాణ బీజేపీ విజయానికి కూతవేటు దూరంలో ఉండగా బీజేపీ అధిష్టానం నిర్ణయాల వలన చేజేతులా ఆ విజయవకాశాన్ని కాంగ్రెస్ చేతికి అప్పజెప్పింది.
ఏపీలో వైసీపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చి వైసీపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా మంచి సంకేతాలే ఇచ్చింది. ఆమె కూడా వెంటనే జగన్ ప్రభుత్వం మీద ఉదృతంగా పోరాటం మొదలుపెట్టారు. కానీ జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 10 రోజులవుతున్నా ఇంతవరకు మోడీ, అమిత్ షాలు స్పందించకపోవడంతో ఆమె పోరాటమంతా వృధా అయిన్నట్లే భావించవచ్చు.
ఇటువంటి సున్నితమైన అంశాలపై ఆచితూచి స్పందించడం అవసరమే కానీ దానికి 10 రోజులు సమయం అవసరం లేదు. మౌనం అర్ధాంగికారం కనుక వారి మౌనం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లే భావించాల్సి ఉంటుంది. అంటే ఏపీ బీజేపీ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, వారి అధిష్టానం జగన్ ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు పంపుతున్నట్లవుతోంది.
కనీసం, టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై బీజేపీ అధిష్టానం ఇంతవరకు స్పందించకపోవడంతో బీజేపీ అధిష్టానం వైసీపివైపు మొగ్గు చూపుతునట్లు రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్య ప్రజలు కూడా అనుమానిస్తున్నారు.
అంటే తెలంగాణలో బీజేపీని ఏవిదంగా దెబ్బ తీసుకొందో, ఏపీలో బీజేపీని కూడా దెబ్బ తీసుకొంటున్నట్లు భావించవచ్చు. కానీ ఎందుకు ఇలా చేస్తోంది?అనే ప్రశ్నకు సమాధానం మరో విశ్లేషణలో చెప్పుకొందాము.
—



