ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ టీవీ9 ‘క్రాస్ ఫైర్’ పేరుతో నిర్వహించిన ముఖాముఖీలో అమరావతితో సహా ఏపీకి సంబందించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం, బిజెపి వైఖరిని స్పష్టంగా చెప్పారు.
మూడు రాజధానులు, అమరావతి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ,” కేంద్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా భావిస్తోంది. కనుకనే రాజధాని అభివృద్ధికి వేల కోట్లు నిధులు ఇచ్చింది. అమరావతిని కడపను కలుపుతూ రూ.3,000 కోట్లతో రోడ్లు నిర్మిస్తోంది. అమరావతిని రైల్వేలైన్‌తో కనెక్ట్ చేస్తోంది. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మించింది. ఇవన్నీ కూడా ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందనే నమ్మకంతోనే చేస్తున్నప్పుడు మళ్ళీ రాజధాని విషయంలో సందేహం ఏముంటుంది? గతంలో కన్నా లక్ష్మినారాయణ, సోమూ వీర్రాజు, ఇపుడు నేను కూడా అమరావతికే కట్టుబడి ఉన్నాము.
మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ ప్రభుత్వ సొంత ఆలోచనే తప్ప కేంద్రం సూచించింది కాదు. అయినా మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడం వితండవాదమే. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రావాలి.
జగన్ ప్రభుత్వం నాలుగేళ్ళుగా రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమని తేలేకపోగా రాష్ట్రంలో ఉన్నవాటిని కూడా తరిమి కొడుతోంది. విశాఖ నుంచి లులూ గ్రూప్‌ని తరిమేసి ఇనార్బిట్ మాల్ ఒక్కటి కడితే చాలా? మిగతా ఇండస్ట్రీస్ అవసరం లేదా?ఈ విషయం పలువురు పారిశ్రామికవేత్తలు నాకు స్వయంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరిస్తూ మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలదు?” అని దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా గురించి ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పానని కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విదాలా అప్పుడు టిడిపి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలకి సహాయసహకారాలు అందిస్తూనే ఉంది కానీ అవి ప్రాజెక్టుని పూర్తిచేయలేకపోయాయని అన్నారు.
జనసేనతో బిజెపికి పొత్తు ఉందని, టిడిపితో పొత్తు విషయం తమ అధిష్టానం నిర్ణయిస్తుందని పురందేశ్వరి చెప్పారు. ఇక నుంచి ఏపీలో బిజెపిని మరింత యాక్టివ్ చేసి జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.



