Daggubati Purandeswariమాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకి పంపి, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమం ఏదో పూర్తి చేసిన్నట్లు స్వీట్లు పంచుకొని పండుగ చేసుకొంది.

ఈ నిర్ణయం వలన టిడిపి ఒక్కటే ఇబ్బంది పడటం లేదు. టిడిపితో ఎటువంటి సంబందమూ లేని ఏపీ బీజేపీ కూడా ఇబ్బంది పడుతోంది. గమ్మత్తైన విషయం ఏమిటంటే, తమతో పొత్తులో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో కలిసి పనిచేస్తామని చెప్పడంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈ పరిణామాన్ని ఏవిదంగా సమర్ధించుకోవాలో తెలియక తలపట్టుకొన్నారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ, “జనసేన ఎన్డీయేలోనే ఉందని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చెప్పారు. కనుక బీజేపీ, జనసేనల మద్య పొత్తులు ఉన్నట్లే లెక్క. ఆయనే ఢిల్లీకి వెళ్ళి మా అధిష్టానంతో భేటీ అయ్యి టిడిపితో కలిసి ఎందుకు ఎన్నికలలో పోటీ చేయవలసివస్తోందో వివరిస్తానని అన్నారు. ఆయన అభిప్రాయం విన్న తర్వాత మా అధిష్టానం మా అభిప్రాయం అడిగినప్పుడు మేమూ చెపుతాము. కనుక మేము కూడా టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామా లేదా? అనే ఊహాజనితమైన ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేను,” అని అన్నారు.

ఇక ఏపీ బీజేపీ మరో అపవాదు కూడా ఎదుర్కొంటోంది. ప్రధాని మోడీ, అమిత్ షాల అనుమతితోనే జగన్‌ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని మీడియా, టిడిపిలో కొందరు నేతలు, ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణపై కూడా ఆమె స్పందిస్తూ, “చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన వెంటనే మొట్టమొదట మేమే ఖండించాము. ఆయనను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంతోనే అరెస్ట్ చేసిన్నట్లు అర్దమవుతోంది. మరి చంద్రబాబు నాయుడు అరెస్టుతో కేంద్రానికి ఏం సంబందం?” అని దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు.