నవతరం క్రికెటర్ల బీభత్సమైన బ్యాటింగ్ ప్రతిభలతో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఉన్న రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఆ క్రమంలోనే తాజాగా మరో రికార్డుకు సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఎసరు పెట్టారు. బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో అతి తక్కువ బంతులలో సెంచరీ చేసిన క్రికెటర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు డేవిడ్ మిల్లర్.
బంగ్లాతో జరుగుతున్న రెండవ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముఖ్యంగా చివరి 10 ఓవర్లలో ఏకంగా 146 పరుగులు చేయడం రాబట్టగా, చివరి 5 ఓవర్లలో 90 పరుగులు చేసింది. చివరి 4 ఓవర్లలో డేవిడ్ మిల్లర్ ఒక్కడే 59 పరుగులు చేయడం విశేషం. చివరి 16 బంతులలో 6 సిక్సర్లు, 4 ఫోర్లను కొట్టి తన బ్యాట్ పవర్ ఏంటో బంగ్లా బౌలర్లకు రుచి చూపించాడు.
సైఫుద్దీన్ వేసిన 19వ ఓవర్ లో ఏకంగా 5 సిక్సర్లు బాది, కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి సఫారీ భారీ స్కోర్ కు కారణమయ్యాడు. మిల్లర్ విధ్వంసం తర్వాత అంతటి భారీ స్కోర్ ను చేధించలేక బంగ్లా 141 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో టీ20 సిరీస్ ను 2-0తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది.


